టీ20 ప్రపంచకప్ 2026 (T20 WC) లో భారత జట్టు వరుస విజయాలతో దూసుకుపోతూ అభిమానుల్లో భారీ ఆశలు రేకెత్తిస్తోంది. గ్రూప్ దశలో ఇప్పటికే కీలక మ్యాచ్‌ల్లో గెలుపొందిన టీమిండియా, సెమీఫైనల్ దిశగా ధీమాగా అడుగులు వేస్తోంది.
అయినప్పటికీ, ఈ టోర్నీలో అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న అసలైన పోరు మాత్రం ఫిబ్రవరి 15న జరగనుంది. శ్రీలంక రాజధాని కొలంబో వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ క్రికెట్ జట్టుతో భారత జట్టు తలపడేందుకు సిద్ధమవుతోంది. ఇండియా-పాక్ మ్యాచ్ అంటేనే క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ, ఉత్సాహం వేరే స్థాయిలో ఉంటుంది.
India vs Namibia T20 World : నమీబియాపై భారత్ భారీ స్కోరు
అయితే ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ఫిట్‌నెస్‌పై సస్పెన్స్ కొనసాగుతోంది. పొట్ట సంబంధిత అనారోగ్యం కారణంగా నమీబియా మ్యాచ్‌కు దూరమైన ఈ యువ హిట్టర్, పాక్ మ్యాచ్‌లో కనిపిస్తాడా లేదా అన్నదానిపై తాజాగా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. నమీబియాతో మ్యాచ్ ముగిసిన తర్వాత వరుణ్ చక్రవర్తి విలేకరులతో మాట్లాడుతూ అభిషేక్ శర్మ ఆరోగ్యంపై సానుకూల సంకేతాలు ఇచ్చాడు. అమెరికాతో మ్యాచ్ తర్వాత అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన అభిషేక్, ఇప్పుడు డిశ్చార్జ్ అయి జట్టుతోనే ఉన్నాడు.
అభిషేక్ స్థానంలో ఇషాన్ కిషన్
'అభిషేక్ మళ్లీ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. నేను అతనితో మాట్లాడాను, అతను చాలా ఉత్సాహంగా ఉన్నాడు. పాకిస్థాన్‌తో జరిగే తర్వాతి మ్యాచ్‌లో అతను ఆడే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను' అని వరుణ్ వెల్లడించాడు. నమీబియాతో మ్యాచ్ జరుగుతున్నప్పుడు అభిషేక్ డగౌట్‌లో కూర్చుని జట్టును ఉత్సాహపరచడం కూడా అభిమానుల్లో ఆశలు రేకెత్తిస్తోంది.

ఒకవైపు వరుణ్ చక్రవర్తి ఆశాభావం వ్యక్తం చేస్తుంటే, మరోవైపు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యలు కాస్త భిన్నంగా ఉన్నాయి. నమీబియా మ్యాచ్ టాస్ సమయంలో సూర్య మాట్లాడుతూ.. అభిషేక్ శర్మ కోలుకోవడానికి మరో ఒకటి లేదా రెండు మ్యాచ్‌లు పట్టవచ్చని హింట్ ఇచ్చాడు. ఒకవేళ పాక్ మ్యాచ్ సమయానికి అభిషేక్ వంద శాతం ఫిట్‌నెస్ సాధించకపోతే, అతని స్థానంలో ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా కొనసాగే అవకాశం ఉంది. కొలంబో చేరుకున్న తర్వాత ఫిబ్రవరి 14న జరిగే తుది ప్రాక్టీస్ సెషన్‌ను బట్టి అభిషేక్ భవితవ్యం తేలనుంది.

