Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టాలీవుడ్ స్టార్ విలన్ ప్రదీప్ రావత్ మృతి

టాలీవుడ్ స్టార్ విలన్ ప్రదీప్ రావత్ మృతి

వార్త 2 days ago

Pradeep Ravath : ప్రముఖ నటుడు, టాలీవుడ్‌లో విలన్ పాత్రలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ రావత్ (Pradeep Ravath) కన్నుమూశారు. 74 ఏళ్ల గుండెపోటుతో మంగళవారం సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచినట్లు ఆయన మేనేజర్ వెల్లడించారు.

ఈ వార్తతో బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. సహనటులు, దర్శకులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.

టాలీవుడ్‌లో ఆయనకు ప్రత్యేక గుర్తింపు :

తెలుగు ప్రేక్షకులకు ప్రదీప్ రావత్ పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చే సినిమా సై. ఈ చిత్రంలో ఆయన పోషించిన భిక్షు యాదవ్ పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ పాత్రలో ఆయన చూపించిన క్రూరత్వం, సంభాషణల తీరు, హావభావాలు టాలీవుడ్‌లో ఆయనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. ఈ చిత్రానికి ఆయన ఉత్తమ ప్రతినాయకుడిగా నంది అవార్డు, ఫిల్మ్‌ఫేర్ అవార్డు సహా పలు పురస్కారాలు అందుకున్నారు.

ఆ తర్వాత ఛత్రపతి, వీర, రెబల్, నాయక్, బాద్‌షా, 1: నేనొక్కడినే, అల్లుడు శ్రీను, సరైనోడు, జై లవకుశ, వాల్తేరు వీరయ్య వంటి అనేక తెలుగు చిత్రాల్లో విలన్‌గా, కీలక పాత్రల్లో నటించి తనదైన ముద్ర వేశారు. ప్రతి సినిమాలో భిన్నమైన బాడీ లాంగ్వేజ్‌, గంభీరమైన స్వరం, శక్తివంతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు.

తెలుగు, హిందీ, తమిళ భాషల్లో వందకు పైగా చిత్రాల్లో నటించిన ప్రదీప్ రావత్, ప్రతినాయక పాత్రలకు కొత్త శైలిని తీసుకొచ్చిన నటుడిగా గుర్తింపు పొందారు. మహాభారత్ టెలివిజన్ సీరియల్‌లో అశ్వత్థామ పాత్రతో ప్రారంభమైన ఆయన నట జీవితానికి దాదాపు నాలుగు దశాబ్దాల ప్రయాణం ఉంది. ఆయన మరణంతో భారతీయ సినీ పరిశ్రమ ఓ విలక్షణ నటుడిని కోల్పోయిందని సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అభిమానుల మదిలో ఆయన పోషించిన శక్తివంతమైన విలన్ పాత్రలు చిరస్థాయిగా నిలిచిపోతాయి.

చేపలానే ఉండే బ్లూవేల్ గురించి మీకు తెలుసా..?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha