Ram Gopal Varma: విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) తనదైన శైలిలో మరోసారి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ కారుపై జరిగిన కాల్పుల ఘటనలో పట్టుబడిన నిందితుల రూపురేఖలను ఉద్దేశించి ఆయన చేసిన పోస్ట్ ప్రస్తుతం సినీ వర్గాల్లోనూ, నెట్టింటనూ తీవ్ర చర్చనీయాంశమైంది.

సినిమాల్లో విలన్ల అడ్డాలో టీ అందించే కుర్రాళ్లలా కూడా లేరు: వర్మ
పట్టుబడిన నిందితులు చూసేందుకు ఎంత సామాన్యంగా ఉన్నారంటూ వర్మ వ్యంగ్యంగా విమర్శించారు. సినిమాల్లో విలన్ల గ్యాంగ్‌లో కనీసం టీ అందించే చిన్నపాటి పాత్రలకు కూడా వారిని ఎంపిక చేయరని ఎద్దేవా చేశారు. నిజ జీవితంలోని నేరగాళ్లకు, వెండితెరపై కనిపించే గ్లామరస్ విలన్లకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుందని తన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో పేర్కొన్నారు. మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీంపై సినిమా తీసినా, నిజమైన దావూద్‌లా కనిపించే వ్యక్తిని ఆ పాత్రకు ఎంపిక చేయకపోవచ్చంటూ ఉదాహరణగా రాసుకొచ్చారు. ప్రముఖ కాస్టింగ్ డైరెక్టర్ ముఖేశ్ ఛాబ్రాను ట్యాగ్ చేస్తూ.. రీల్ లైఫ్ కాస్టింగ్ డైరెక్టర్‌తో పోలిస్తే రియల్ లైఫ్ కాస్టింగ్ డైరెక్టర్ అభిరుచి ఎంతో విచిత్రంగా ఉంటుందని పేర్కొన్నారు.
Ram Gopal Varma: అక్టోబర్ 19న ముంబైలో జరిగిన కాల్పుల ఘటన నేపధ్యం
అక్టోబర్ 19న ముంబైలోని జుహు ప్రాంతంలో ఉన్న ఫుట్‌బాల్ క్లబ్ సమీపంలో టైగర్ ష్రాఫ్ కారు లక్ష్యంగా దుండగులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో టైగర్ సురక్షితంగా బయటపడగా, ఆయన డ్రైవర్‌తో పాటు మరో ఆటో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఈ కేసుకు సంబంధించి పోలీసులు రాజస్థాన్‌లోని కోటాలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. కాగా, ఈ ఘటనపై గతంలోనే స్పందించిన వర్మ.. ఈ దాడి వెనుక డబ్బు, సుపారీ లేదా పాత కక్షల కన్నా కేవలం ‘అహం, గర్వం’ మాత్రమే ప్రధాన కారణమై ఉండొచ్చని విశ్లేషించడం గమనార్హం.

