Thalliki Vandanam: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన తల్లుల ఖాతాల్లో 'తల్లికి వందనం' పథకం రెండో విడత నిధులను జూలై 16 నుంచి 18వ తేదీల మధ్య జమ చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌ల (PTM) సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నిధులను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి విడుదల చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

త్వరలోనే మెగా జాబ్ క్యాలెండర్: 10,000 కొత్త ఉద్యోగాలు
రేణిగుంట మండలంలో జరిగిన శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ శ్రేణుల అంతర్గత సమావేశంలో మంత్రి లోకేష్ ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం అధికార బాధ్యతలు స్వీకరించిన కేవలం 150 రోజుల వ్యవధిలోనే 16,000 ఉపాధ్యాయ కొలువులు, 6,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసిందని గుర్తుచేశారు. దీనికి అదనంగా ఈ ఏడాదిలోనే మరో 10,000 ఖాళీలతో సరికొత్త మెగా జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించబోతున్నట్లు నిరుద్యోగులకు తీపి కబురు అందించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు జూలై 15 నుంచి ‘ఇంటింటి ప్రచారం’ ప్రారంభించాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
Thalliki Vandanam: ప్రభుత్వ పాఠశాలల తనిఖీ.. ఆలయ సందర్శన
శ్రీకాళహస్తి పర్యటనలో భాగంగా మంత్రి లోకేష్ పలు ప్రభుత్వ పాఠశాలలను అకస్మాత్తుగా సందర్శించి అక్కడి విద్యా ప్రమాణాలను, మౌలిక వసతులను పరిశీలించారు. చదువుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన స్థానిక విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించి, పలువురు పేద లబ్ధిదారులకు ప్రభుత్వ ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. కార్యక్రమాల అనంతరం ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి చేరుకున్న మంత్రి, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Epaper: epaper.vaartha.com

