Tammineni Sitaram: శ్రీకాకుళంలో తీవ్ర సంచలనం రేపిన భూకబ్జా వివాదంలో వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
తమపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని (క్వాష్) కోరుతూ తమ్మినేని సీతారాం, ఆయన సతీమణి వాణి, కుమారుడు చిరంజీవి నాగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం దాన్ని తిరస్కరించింది. అంతేకాకుండా, వారిని అరెస్ట్ చేయకుండా ఎలాంటి ముందస్తు లేదా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు కూడా కోర్టు నిరాకరించింది.
దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉందన్న ధర్మాసనం.. తదుపరి విచారణ వాయిదా
ఈ విచారణను చేపట్టిన జస్టిస్ వై. లక్ష్మణరావు ధర్మాసనం, కేసు విచారణ ప్రస్తుతం తొలి దశలోనే ఉందని.. ఈ సమయంలో జోక్యం చేసుకోవడం కుదరదని విస్పష్టంగా తెలిపింది. ఒకవేళ అరెస్ట్ అవుతామనే భయం ఉంటే చట్టప్రకారం ముందస్తు బెయిల్ (యాంటిసిపేటరీ బెయిల్) కోసం దరఖాస్తు చేసుకోవాలని పిటిషనర్లకు న్యాయమూర్తి సూచించారు. ఈ వ్యవహారంపై కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేస్తూ, తదుపరి విచారణను జూలై 29కి వాయిదా వేసింది.
Tammineni Sitaram: రూ.4 కోట్ల విలువైన భూమి కబ్జా ఆరోపణలు.. నకిలీ డెత్ సర్టిఫికెట్‌తో రిజిస్ట్రేషన్
శ్రీకాకుళం పట్టణ పరిధిలోని చాపరం గ్రామ పంచాయతీలో ఉన్న సుమారు రూ.4 కోట్ల విలువ చేసే 900 గజాల విలువైన స్థలాన్ని తమ్మినేని కుటుంబం అక్రమంగా ఆక్రమించిందని ఆరోపణలు వెలువడ్డాయి. అసలు యజమాని ప్రాణాలతోనే ఉన్నప్పటికీ, ఆయన మరణించినట్లు నకిలీ మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించి, దొంగ పత్రాల సహాయంతో ఆ స్థలాన్ని తమ్మినేని కుమారుడి పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని కట్టా జయకిషోర్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
13 మందిపై కేసు.. అజ్ఞాతంలోకి మాజీ స్పీకర్ కుటుంబం
ఈ అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో పోలీసులు మొత్తం 13 మందిని నిందితులుగా చేర్చగా, వారిలో ఎనిమిది మందిని ఇప్పటికే అరెస్ట్ చేసి కస్టడీకి తరలించారు. హైకోర్టు పిటిషన్‌ను తిరస్కరిస్తూ తీర్పు ఇవ్వడంతో, అరెస్ట్ భయంతో తమ్మినేని సీతారాం ఆయన కుటుంబ సభ్యులు ఆమదాలవలసలోని తమ స్వగృహం నుంచి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వారి ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చేపట్టినట్లు సమాచారం.

