Telangana: తెలంగాణ భారతీయ జనతా పార్టీలో గత కొంతకాలంగా సాగుతున్న అంతర్గత రాజకీయాలకు బ్రేక్ పడింది. పార్టీలోని ఇద్దరు కీలక నేతలు, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మరియు ఎంపీ ఈటల రాజేందర్ తమ మధ్య ఉన్న విభేదాలను పక్కనబెట్టేశారు.
రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఇరువురు నేతలు ఇకపై కలిసి నడవాలని నిర్ణయించుకున్నారు.

హైదరాబాద్‌లోని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ నివాసం ఈ చారిత్రాత్మక సయోధ్య భేటీకి వేదికైంది. శనివారం జరిగిన ఈ కీలక సమావేశంలో రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ అభయ్ పాటిల్ ముఖ్య మధ్యవర్తిగా వ్యవహరించి, ఇద్దరు నేతల మధ్య నెలకొన్న దూరాన్ని తగ్గించడంలో విజయవంతమయ్యారు.
హైకమాండ్ ఆదేశాలు.. నేతల సానుకూల స్పందన
తెలంగాణలో బీజేపీని అధికార పీఠంపై కూర్చోబెట్టడమే పరమావధిగా అందరూ విభేదాలు వీడి పనిచేయాలని అధిష్టానం గట్టిగా ఆదేశించినట్లు అభయ్ పాటిల్ ఈ సందర్భంగా నేతలకు స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఈటల రాజేందర్ స్పందిస్తూ.. పార్టీ శ్రేయస్సు కోసమే తమ ప్రాధాన్యతని, ఎవరిపైనా తనకు వ్యక్తిగత కక్షలు లేవని తేల్చి చెప్పారు. చిన్నపాటి మనస్పర్థలను విస్మరించడానికి తాను ఎప్పుడూ సిద్ధమేనన్నారు. మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం సానుకూలంగా స్పందించారు. తనకు ఎవరిపైనా అసంతృప్తి లేదని, పార్టీ క్రమశిక్షణా పరిధి దాటకుండా పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఒకవేళ తన వైపు నుంచి ఏదైనా పొరపాటు జరిగి ఉంటే, దాన్ని సరిదిద్దుకోవడానికి వెనకాడనని బండి సంజయ్ పేర్కొనడం విశేషం.
Telangana: శుభం కార్డు పడిన వివాదం.. లక్ష్మణ్ క్లారిటీ
సమావేశం ముగిసిన అనంతరం బండి సంజయ్, ఈటల రాజేందర్ ఒకరినొకరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని, మీడియా కెమెరాలకు నవ్వుతూ పోజులిచ్చారు. దీంతో గత కొంతకాలంగా ఇద్దరు బీసీ అగ్రనేతల మధ్య నడుస్తున్న కోల్డ్ వార్‌కి అధికారికంగా తెరపడినట్లయింది. ఈ విభేదాల వల్ల పార్టీ క్యాడర్‌లో నెలకొన్న అయోమయానికి ఈ భేటీతో స్పష్టత వచ్చింది. అయితే, ఈ పరిణామాలపై ఎంపీ కె. లక్ష్మణ్ మాట్లాడుతూ.. నేతల మధ్య అసలు విభేదాలే లేవని కొట్టిపారేశారు. దేశంలో రాబోయే జమిలి ఎన్నికల వ్యూహాలు, మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు వంటి కీలక జాతీయ అంశాలపై చర్చించడానికే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన మీడియాకు వివరించారు.

