Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణలో ట్రాఫిక్‌పై కొత్త నిఘా

తెలంగాణలో ట్రాఫిక్‌పై కొత్త నిఘా

వార్త 1 week ago

TG-TMARS: తెలంగాణలో ట్రాఫిక్ రద్దీ, రోడ్డు ప్రమాదాలను తగ్గించడంతో పాటు ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను మరింత పటిష్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం TG-TMARS పేరుతో ప్రత్యేక బ్యూరోను ఏర్పాటు చేసింది.

హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఈ వ్యవస్థకు ఉన్నత స్థాయి పోలీసు అధికారి నేతృత్వం వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రత, హైవే పెట్రోలింగ్, ప్రమాదాల స్పందన, సాంకేతిక ఎన్‌ఫోర్స్‌మెంట్ వంటి అంశాలను సమన్వయం చేయడం ఈ బ్యూరో ప్రధాన లక్ష్యం.

Read Also :Revanth Reddy: సీఎం రేవంత్‌కు ప్రతిష్టాత్మక ఆర్యాడన్ మహమ్మద్ అవార్డు

రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్‌కు ఒకే సమన్వయ వ్యవస్థ

తెలంగాణలో ఇప్పటికే కమిషనరేట్లు, జిల్లాల పరిధిలో వేర్వేరు ట్రాఫిక్ విభాగాలు పనిచేస్తున్నాయి. వీటి కార్యకలాపాలను మరింత సమన్వయంతో నిర్వహించేలా TG-TMARS పర్యవేక్షణ వ్యవస్థను తీసుకొచ్చారు. ట్రాఫిక్ రద్దీని కేవలం ఉల్లంఘనలపై జరిమానాలతో నియంత్రించకుండా.. రద్దీ సమయాలు, వాతావరణ పరిస్థితులు, కార్యాలయాల పనివేళలు, స్థానిక పరిస్థితులు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రణాళికలు రూపొందించాలని ప్రభుత్వం ఇప్పటికే సూచించింది.

ప్రతి పోలీస్ స్టేషన్‌లో యాక్సిడెంట్ రెస్పాన్స్ ఆఫీసర్

TG-TMARSలో కీలకమైన అంశాల్లో ఒకటి Road Accident Response Officer వ్యవస్థ. ప్రతి పోలీస్ స్టేషన్‌లో ఒక అధికారికి ఈ బాధ్యతలను అప్పగించనున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనాస్థలికి చేరుకోవడం, సహాయక చర్యలను సమన్వయం చేయడం, క్షతగాత్రులను వీలైనంత త్వరగా ఆస్పత్రికి తరలించేలా చూడటం ఈ అధికారుల బాధ్యతగా ఉంటుంది. ముఖ్యంగా ప్రమాదం జరిగిన తర్వాత తొలి గంటలో వైద్యం అందేలా చర్యలు తీసుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. దీంతో ప్రమాద బాధితులకు అత్యవసర వైద్య సహాయం అందే సమయాన్ని తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

ORR, హైవేలపై ప్రత్యేక పెట్రోలింగ్

ఔటర్ రింగ్ రోడ్, జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలు, ఇతర కీలక హైవేలపై ప్రత్యేక హైవే పెట్రోలింగ్ యూనిట్లు పనిచేయనున్నాయి. అతివేగం, ప్రమాదకర డ్రైవింగ్, ఇతర ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించేందుకు పెట్రోలింగ్ వాహనాల్లో ఆధునిక సాంకేతిక పరికరాలను వినియోగించనున్నారు. ప్రభుత్వం ఇప్పటికే ORRపై ప్రమాదాల నివారణ, నిరంతర పర్యవేక్షణను బలోపేతం చేయడంతో పాటు హైదరాబాద్‌లో స్మార్ట్ సిగ్నలింగ్‌పై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించింది.

స్పీడ్ డిటెక్టర్లు, కెమెరాలతో ఎన్‌ఫోర్స్‌మెంట్

కొత్త వ్యవస్థలో స్పీడ్ డిటెక్టర్లు, డ్యాష్‌బోర్డ్ కెమెరాలు, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) వంటి టెక్నాలజీని ఉపయోగించనున్నారు. వాహనాల వేగం, కదలికలు, ట్రాఫిక్ ఉల్లంఘనలను సాంకేతిక పరిజ్ఞానం ద్వారా గుర్తించి అవసరమైన ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు చేపట్టేలా వ్యవస్థను రూపొందిస్తున్నారు.

ట్రాఫిక్ జరిమానాల్లో 40 శాతం ప్రత్యేక ఫండ్‌కు

TG-TMARS నిర్వహణ కోసం Traffic Management Fund ఏర్పాటు చేశారు. మోటార్ వెహికల్స్ చట్టం కింద పోలీసులు వసూలు చేసే కాంపౌండింగ్ ఫీజులు, జరిమానాల్లో 40 శాతం ఈ నిధికి జమ చేయనున్నారు. ఈ నిధులను ఎలక్ట్రానిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పరికరాలు, పెట్రోలింగ్ వాహనాలు, హైవే పరికరాలు, డ్యాష్‌బోర్డ్ కెమెరాలు, ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలు, సిబ్బంది శిక్షణ, అత్యవసర రోడ్డు పనులు, రోడ్డు భద్రత చర్యలకు వినియోగించనున్నారు.

ప్రతి కమిషనరేట్‌లో JCP ట్రాఫిక్.. జిల్లాల్లో అదనపు ఎస్పీ

ట్రాఫిక్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి పోలీస్ కమిషనరేట్‌లో జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) పోస్టును, ప్రతి జిల్లాలో అదనపు ఎస్పీ (ట్రాఫిక్) పోస్టును ఏర్పాటు చేయనున్నారు. అదనంగా ఇతర పోలీస్ విభాగాల నుంచి 300 పోస్టులను TG-TMARSకు బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఉన్న ట్రాఫిక్ వింగ్స్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు, ఈ-చలాన్ కార్యకలాపాలు కూడా బ్యూరో పర్యవేక్షణలోకి రానున్నాయి.

స్టేట్ ట్రాఫిక్ ట్రైనింగ్ అకాడమీ

ట్రాఫిక్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందించేందుకు State Traffic Training Academy ఏర్పాటు చేయనున్నారు. ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, Intelligent Traffic Systems, ఎలక్ట్రానిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్, రోడ్డు ప్రమాదాల స్పందన, క్రాష్ ఇన్వెస్టిగేషన్ వంటి అంశాల్లో సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు.

ఈ-చలాన్ నుంచి డేటా విశ్లేషణ వరకు

TG-TMARS పరిధిలో ఈ-చలాన్ వ్యవస్థ పర్యవేక్షణ, ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్, డేటా విశ్లేషణ, ప్రమాదాల దర్యాప్తు, హైవే పెట్రోలింగ్ వంటి కార్యకలాపాలను సమన్వయం చేయనున్నారు. టెక్నాలజీ ఆధారిత ట్రాఫిక్ నిర్వహణను మరింత విస్తరించేందుకు ప్రత్యేక టెక్నాలజీ విభాగం సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, AI ఆధారిత పరిష్కారాలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ టెక్నాలజీ వినియోగంపై పనిచేయనుంది.

TG-TMARS: ఆరు నెలల్లో పూర్తిస్థాయి కార్యకలాపాలు

TG-TMARSను పూర్తిస్థాయిలో కార్యకలాపాల్లోకి తీసుకురావడానికి ఆరు నెలల్లో ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. బ్యూరో పనితీరు, అమలు పురోగతిపై రాష్ట్ర రోడ్డు భద్రతా మండలికి నివేదిక ఇవ్వాలని TG-TMARS డైరెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చినట్లు తాజా వివరాలు పేర్కొంటున్నాయి. మొత్తంగా TG-TMARS ద్వారా తెలంగాణలో ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు ప్రమాదాల నివారణ, హైవే పెట్రోలింగ్, సాంకేతిక ఎన్‌ఫోర్స్‌మెంట్, ప్రమాదాలపై వేగవంతమైన స్పందన వంటి అంశాలను ఒకే సమన్వయ వ్యవస్థలోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

దానం అనర్హతపై సుప్రీం తీర్పు.. కౌశిక్ రెడ్డి హర్షం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha