Tirumala: తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తీపి కబురు అందించింది. తిరుమల కొండపై రవాణా సదుపాయాలను మరింత మెరుగుపరిచేందుకు నూతనంగా ఉచిత ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది.
'శ్రీవారి ధర్మరథం' పేరుతో నడిచే ఈ బస్సుల్లో భక్తులు తిరుమలలోని ఏ ప్రాంతానికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు.
Read Also :TTD updates: తిరుమల మాడ వీధులకు కొత్త పేర్లు

రిలయన్స్ పరిశ్రమల అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ గతంలో టీటీడీకి ప్రకటించిన రూ. 27.5 కోట్ల విలువైన 25 ఎలక్ట్రిక్ బస్సుల్లో భాగంగా మొదటి విడతగా 15 బస్సులు ఇప్పటికే తిరుపతి నుంచి తిరుమలకు చేరుకున్నాయి. రాబోయే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ బస్సులను అధికారికంగా ప్రారంభించనున్నారు.
Tirumala: ఎలక్ట్రిక్ బస్సుల ప్రత్యేకతలు & హుండీ బియ్యం ఈ-వేలం వివరాలు
గత జూన్ మాసంలో శ్రీవారిని దర్శించుకున్న అనంత్ అంబానీ 25 ఎలక్ట్రిక్ బస్సులతో పాటు వాటికి కావలసిన ఛార్జింగ్ స్టేషన్లు, డ్రైవర్ల నిర్వహణను కూడా విరాళంగా ఇస్తామని హామీ ఇచ్చారు. మిగిలిన 10 బస్సులు త్వరలోనే రానున్నాయి. ప్రస్తుతం ఉన్న ధర్మరథాల సంఖ్య తక్కువగా ఉండటంతో నిరంతరం తీవ్ర రద్దీ నెలకొంటోంది. ఈ కొత్త ఈ-బస్సులు రావడంతో భక్తులకు ప్రయాణ ఇబ్బందులు తొలగనున్నాయి. ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తి చేసుకున్న ఈ బస్సులకు టీటీడీ ఎలక్ట్రిక్ బస్ స్టేషన్‌లో ఛార్జింగ్ సదుపాయం కల్పించారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఈ ఏర్పాట్లను పరిశీలించారు. టీటీడీ అనుబంధ ఆలయాల్లో భక్తులు హుండీల ద్వారా సమర్పించిన 7,938 కిలోల బియ్యానికి ఈ నెల 8వ తేదీన ఈ-వేలం (E-Auction) నిర్వహించనున్నారు. ఆసక్తి గలవారు konugolu.ap.gov.in వెబ్‌సైట్‌లో గానీ, 0877-2264429 ఫోన్ నంబర్ ద్వారా గానీ వివరాలు తెలుసుకోవచ్చు.

