Tirumala:పెరటాసి మాసం మూడో శనివారాన్ని పురస్కరించుకుని తిరుమలకు భక్తులు భారీగా పోటెత్తారు. తమిళనాడు, కర్ణాటక సహా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుపతి నగరం కిటకిటలాడింది.
ప్రధాన రహదారులతో పాటు తిరుమల నడక మార్గాలు, ఘాట్‌రోడ్డులోనూ రద్దీ కనిపించింది. గోవింద మాల ధరించిన భక్తుల నామస్మరణలతో తిరుపతి పురవీధులు మారుమోగాయి.
PM Kisan: దసరా కానుకగా రైతుల ఖాతాల్లో రూ.2 వేలు!
టోకెన్ల కోసం భారీగా క్యూ
శనివారం దర్శనం కోసం తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్‌లలో శుక్రవారం ఉదయం 5 గంటలకు 10 వేల ఎస్‌ఎస్‌డీ టోకెన్లను జారీ చేశారు. భక్తుల నుంచి భారీ స్పందన రావడంతో ఈ టోకెన్లు గంటలోపే పూర్తయ్యాయి. టోకెన్లు పొందిన భక్తులకు శనివారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనం కల్పించనున్నారు.

శ్రీవారి మెట్టు మార్గంలో తిరుమలకు వెళ్లే భక్తుల కోసం మరో 2 వేల టోకెన్లను అందుబాటులో ఉంచారు. టోకెన్ల కోసం గురువారం రాత్రి నుంచే భక్తులు ఆయా కేంద్రాల వద్ద బారులు తీరారు. శుక్రవారం ఉదయం 7 గంటల తర్వాత కేంద్రాలకు చేరుకున్న పలువురు భక్తులకు టోకెన్లు లభించకపోవడంతో నిరాశకు గురయ్యారు. పెరటాసి మూడో శనివారం నేపథ్యంలో తిరుపతికి సుమారు 18 వేల నుంచి 23 వేల మంది భక్తులు చేరుకున్నట్లు అంచనా.
అర్ధరాత్రి నుంచి ఆదివారం టోకెన్లు
ఆదివారం శ్రీవారి దర్శనానికి సంబంధించిన టోకెన్లను శుక్రవారం అర్ధరాత్రి 12.30 గంటలకు జారీ చేయనున్నారు. భక్తుల కోసం 10 వేల ఎస్‌ఎస్‌డీ టోకెన్లతో పాటు 2 వేల శ్రీవారి మెట్టు టోకెన్లను అందుబాటులో ఉంచనున్నారు.

