MDR : యూపీఐ (UPI) లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీలు విధించే దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎంపీ జైరామ్ రమేశ్ తీవ్రంగా మండిపడ్డారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను ప్రసన్నం చేసుకునేందుకే మోదీ ప్రభుత్వం ఈ చర్యకు పూనుకుందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఒకవైపు భారత్‌పై 100 శాతం వరకు టారిఫ్‌లు విధించే బిల్లును ఆమోదించేందుకు అమెరికా సిద్ధమవుతోందని, మరోవైపు భారతీయ ఐటీ నిపుణులు, వలసదారులపై విసా నిబంధనల పేరుతో అమెరికా కఠినంగా వ్యవహరిస్తోందని గుర్తుచేశారు. ఇటువంటి తరుణంలో దేశ ప్రయోజనాలను కాపాడాల్సింది పోయి, యూఎస్ ఒత్తిళ్లకు లొంగిపోవడం దారుణమని ఆయన విమర్శించారు.

యూపీఐని దెబ్బతీసి అమెరికన్ కంపెనీలకు ప్రయోజనమా? – జైరామ్ ప్రశ్నలు
భారత్‌లో వీసా (Visa), మాస్టర్‌కార్డ్ (Mastercard) వంటి అమెరికన్ దిగ్గజ డిజిటల్ పేమెంట్ కంపెనీలు మన దేశీయ యూపీఐతో పోటీ పడలేకపోతున్నాయని, అందుకే యూపీఐ యొక్క ‘జీరో MDR’ విధానాన్ని రద్దు చేయాలని యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ నివేదికల్లో గతంలోనే అసంతృప్తి వ్యక్తం చేశారని జైరామ్ రమేశ్ ఎత్తిచూపారు. అమెరికా కార్పొరేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చడానికే మోదీ ప్రభుత్వం MDR ఛార్జీలు తీసుకువచ్చి యూపీఐ ఉచిత సేవలను దెబ్బతీస్తోందని ఆరోపించారు. ప్రధాని మోదీ అనుసరిస్తున్న ఈ వైఖరి “నరేంద్రుడి నిరంతర ట్రంప్ బుజ్జగింపు చర్యలు” (Narendra’s Ongoing Trump Appeasement) అని ఆయన తీవ్ర స్థాయిలో ఎద్దేవా చేశారు.

