Cyclone : హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఏర్పడే తుఫాన్లకు పేర్లు పెట్టడం వెనుక ప్రత్యేకమైన అంతర్జాతీయ విధానం ఉంది. ప్రపంచ వాతావరణ సంస్థ (WMO), ఐక్యరాజ్యసమితి ఆసియా, పసిఫిక్ ప్రాంతీయ ఆర్థిక, సామాజిక కమిషన్ (ESCAP) ఆధ్వర్యంలోని ఉష్ణమండల తుఫాన్లపై ప్యానెల్ ఈ ప్రక్రియను సమన్వయం చేస్తుంది.
ఉత్తర హిందూ మహాసముద్ర ప్రాంతానికి సంబంధించి భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ సహా 13 దేశాలు ముందుగానే తుఫాన్ల పేర్లను సూచిస్తాయి. ఒక్కో దేశం 13 పేర్ల చొప్పున మొత్తం 169 పేర్లతో కూడిన జాబితాను అందించింది. ఈ పేర్లను నిర్ణీత క్రమంలో ఉపయోగిస్తారు. తుఫాను ఏర్పడినప్పుడు దాని తీవ్రతను బట్టి పేరు పెట్టడం కాకుండా, ముందుగా ఆమోదించిన జాబితా ప్రకారం పేరు కేటాయిస్తారు. ఇలా పేర్లు పెట్టడం వల్ల వాతావరణ హెచ్చరికలు జారీ చేయడం, ప్రజలకు సమాచారం చేరవేయడం, మీడియా ద్వారా తుఫాన్ల వివరాలను సులభంగా గుర్తించడం సాధ్యమవుతుంది.

'అర్నబ్' పేరును సూచించింది బంగ్లాదేశ్
ప్రస్తుతం చర్చలో ఉన్న 'అర్నబ్' అనే తుఫాను పేరును బంగ్లాదేశ్ సూచించింది. ఉత్తర హిందూ మహాసముద్ర ప్రాంతంలో తుఫాన్లకు పేర్లు పెట్టే బాధ్యతను భారత వాతావరణ శాఖ (IMD)లోని న్యూఢిల్లీ ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రం నిర్వహిస్తుంది. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడే తుఫానులకు ముందుగా ఆమోదించిన జాబితా నుంచి వరుస క్రమంలో పేర్లు కేటాయిస్తారు. పేర్ల ఎంపికలో అవి చిన్నగా ఉండటం, సులభంగా పలకగలగడం, వివిధ దేశాల ప్రజలకు అర్థం చేసుకోవడం సులభంగా ఉండటం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఒకసారి ఉపయోగించిన పేరును మళ్లీ ఉపయోగించరు. తుఫాన్లకు పేర్లు పెట్టడం వల్ల వాతావరణ హెచ్చరికలను ప్రజలకు త్వరగా చేరవేయడంతో పాటు ఒకేసారి పలు తుఫాన్లు ఏర్పడినప్పుడు వాటి మధ్య గందరగోళాన్ని నివారించవచ్చు.

