RBI : భారతీయ కరెన్సీ వ్యవస్థలో కీలక మార్పులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సిద్ధమవుతోంది. త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు (RBI) ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ చర్యలు ప్రారంభించాయి.
పైలెట్ ప్రాజెక్టు కింద రూ.10, రూ.20 విలువైన ప్లాస్టిక్ నోట్లను మొత్తం 100 కోట్ల సంఖ్యలో ముద్రించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది.
కాగితపు నోట్లతో పోలిస్తే ప్లాస్టిక్ నోట్లు మరింత మన్నికగా :
ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో వెల్లడించారు. ప్రస్తుతం వినియోగంలో ఉన్న కాగితపు నోట్లతో పోలిస్తే ప్లాస్టిక్ నోట్లు మరింత మన్నికగా ఉండటంతో పాటు ఎక్కువ కాలం ఉపయోగించుకునే వీలుంటుంది. నీటికి తడిసినా, మురికి పట్టినా లేదా సులభంగా చిరిగిపోకుండా ఉండటం వీటి ప్రధాన ప్రత్యేకత. అలాగే నకిలీ కరెన్సీ తయారీని అరికట్టేందుకు అధునాతన భద్రతా ఫీచర్లను వీటిలో అమర్చే అవకాశం ఉంది.

ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, యూకే వంటి అనేక దేశాలు ఇప్పటికే పాలిమర్ (ప్లాస్టిక్) కరెన్సీ నోట్లను విజయవంతంగా వినియోగిస్తున్నాయి. వాటి అనుభవాలను పరిశీలించిన అనంతరం భారత్ కూడా ఈ దిశగా అడుగులు వేస్తోంది.పైలెట్ ప్రాజెక్టు విజయవంతమైతే భవిష్యత్తులో ఇతర విలువల నోట్లను కూడా ప్లాస్టిక్ రూపంలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
ప్లాస్టిక్ నోట్ల వినియోగం వల్ల ముద్రణ వ్యయం దీర్ఘకాలంలో తగ్గే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. అలాగే నోట్ల జీవితకాలం పెరగడంతో తరచూ కొత్త నోట్లు ముద్రించాల్సిన అవసరం కూడా తగ్గుతుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే భారత కరెన్సీ వ్యవస్థలో ఇది ఒక కీలక సంస్కరణగా నిలిచి, భద్రత, మన్నిక, నాణ్యత పరంగా కొత్త ప్రమాణాలను నెలకొల్పే అవకాశముంది.

