TG New Jobs Notifications: తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. త్వరలోనే రాష్ట్రంలో విభిన్న శాఖల్లో ఖాళీగా ఉన్న మరో 50 వేల ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు.
నిరుద్యోగులకు మేలు చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అందుకోసం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని ఆమె స్పష్టం చేశారు.
Notifications for 50,000 new jobs in Telangana coming soon: Minister Seethakka
TG New Jobs Notifications: పదేళ్ల పాలనలో లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు: బీఆర్‌ఎస్‌పై ఫైర్
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై మంత్రి సీతక్క తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం పదేళ్ల సుదీర్ఘ పాలనలో కనీసం లక్ష ఉద్యోగాలను కూడా భర్తీ చేయకుండా రాష్ట్రంలోని నిరుద్యోగులను తీవ్రంగా మోసం చేసిందని ఆమె ఆరోపించారు. నోటిఫికేషన్ల పేరుతో కాలయాపన చేస్తూ యువత భవిష్యత్తుతో ఆడుకున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేశామని గుర్తుచేశారు.
కోర్టు కేసుల వల్లే ఆలస్యం.. త్వరలోనే భారీ నోటిఫికేషన్లు
కొన్ని సాంకేతిక కారణాలు, కోర్టు కేసుల వల్లే ప్రస్తుతం కొన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల ప్రక్రియ ఆలస్యమవుతోందని మంత్రి సీతక్క ఈ సందర్భంగా వెల్లడించారు. లీగల్ చిక్కులన్నింటినీ అధిగమించి, నిరుద్యోగులకు ఎలాంటి నష్టం జరగకుండా పారదర్శకంగా నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దీనిలో భాగంగానే రాబోయే రోజుల్లో 50 వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన కసరత్తును అధికారులు ముమ్మరం చేశారని, త్వరలోనే వీటికి సంబంధించిన అధికారిక ప్రకటనలు వెలువడుతాయని మంత్రి సీతక్క నిరుద్యోగ యువతకు భరోసా ఇచ్చారు.
Epaper: epaper.vaartha.com

