Hyderabad jobs: దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే 'వైట్ కాలర్' అనగా ఆఫీస్ ఉద్యోగాల భర్తీలో హైదరాబాద్ నగరం అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ప్రముఖ జాబ్ పోర్టల్ 'నౌకరి.కామ్' విడుదల చేసిన లేటెస్ట్ 'జాబ్‌స్పీక్' నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
గత సంవత్సరంతో పోలిస్తే ఈ సెప్టెంబర్ నెలలో హైదరాబాద్‌లో నియామకాలు ఏకంగా 9 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఇదే సమయంలో జాతీయ స్థాయిలో మొత్తం ఉద్యోగ నియామకాల వృద్ధి కేవలం 2 శాతంగా మాత్రమే నమోదు కావడం గమనార్హం.

ఇతర మెట్రో నగరాల పరిస్థితి ఎలా ఉంది?
నౌకరి నివేదిక ప్రకారం దేశంలోని ప్రధాన నగరాల జాబ్ మార్కెట్ మిశ్రమ ఫలితాలను చవిచూసింది. హైదరాబాద్ (9 శాతం) తర్వాత స్థానాల్లో చెన్నై (6 శాతం), బెంగళూరు (4 శాతం), కోల్‌కతా (4 శాతం) నగరాలు సానుకూల వృద్ధిని సాధించాయి. మరోవైపు, పుణెలో ఉద్యోగ నియామకాలు ఎటువంటి మార్పులు లేకుండా స్థిరంగా కొనసాగాయి. అయితే, దేశ ఆర్థిక రాజధాని ముంబైతో పాటు జాతీయ రాజధాని ప్రాంతం (ఢిల్లీ-ఎన్‌సీఆర్)లో మాత్రం నియామకాలు 6 శాతం మేర క్షీణించడం ఆందోళన కలిగించే అంశం.
Hyderabad jobs: ఏఐ, ఆటోమొబైల్ రంగాల్లో జోరు.. ఐటీ, ఫార్మాలో తగ్గుదల
రంగాలవారీగా పరిశీలిస్తే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషీన్ లెర్నింగ్ (ML) విభాగాల్లో అత్యధికంగా 20 శాతం వృద్ధి నమోదైంది. అలాగే పండుగ సీజన్ డిమాండ్ మరియు ఎలక్ట్రిక్ వెహికల్స్ (EV) విస్తరణ కారణంగా ఆటోమొబైల్ రంగం 11 శాతం వృద్ధిని సొంతం చేసుకుంది. అయితే, ప్రధాన రంగాలైన ఐటీ-సాఫ్ట్‌వేర్ (-4%), ఫార్మా (-4%), హాస్పిటాలిటీ (-11%), విద్యా రంగం (-18%) వంటి విభాగాలలో మాత్రం నియామకాలు తగ్గుముఖం పట్టాయి.
అనుభవజ్ఞులదే హవా.. ఫ్రెషర్లకు తగ్గిన అవకాశాలు
ప్రస్తుత జాబ్ మార్కెట్‌లో కంపెనీలు అనుభవం ఉన్న నిపుణుల వైపే మొగ్గు చూపుతున్నట్లు ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా 13 నుండి 16 ఏళ్ల మధ్య అనుభవం ఉన్న సీనియర్ ఉద్యోగులకు డిమాండ్ 7 శాతం పెరిగింది. మరోవైపు, ఫ్రెషర్ల నియామకాలు కేవలం ఒక శాతం వృద్ధితో సరిపెట్టుకోగా.. 4 నుండి 7 ఏళ్ల అనుభవం ఉన్న మిడ్-లెవల్ విభాగంలో మాత్రం నియామకాలు 2 శాతం మేర క్షీణించాయి.
సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆర్టీసీ బస్ పాసులు.. పరిశీలనలో ప్రభుత్వం!

