S Janaki: భారతీయ సంగీత ప్రపంచంలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది. దశాబ్దాల పాటు తన అమృత గాత్రంతో కోట్లాది మందిని అలరించిన 'దక్షిణ భారత గానకోకిల' ఎస్.
జానకి (88) మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని, ప్రగాఢ సంతాపాలను వ్యక్తపరిచారు. ఆదివారం నాడు ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఆ మధురగాయనికి ఘనంగా నివాళులర్పించారు. ఎస్. జానకమ్మ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
Read Also :Vietnam Boat Accident: ఏపీ పర్యాటకుల మృతదేహాల తరలింపునకు సీఎం చంద్రబాబు అత్యవసర ఆదేశాలు!
“ఆమె సేవలు అజరామరమైనవి” – సీఎం చంద్రబాబు
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, భారతీయ సినీ సంగీత రంగానికి జానకమ్మ అందించిన సేవలను కొనియాడారు. “ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో పుట్టి, తన అద్భుతమైన స్వరంతో ఆరు దశాబ్దాలకు పైగా కోట్లాది మంది సంగీత ప్రియుల హృదయాలను గెలుచుకున్న మహోన్నత గాయని జానకమ్మ. ఆమె పాడిన పాటలు తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి” అని పేర్కొన్నారు. ఎస్.జానకి కుటుంబ సభ్యులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆమె కోట్లాది మంది అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.
మైసూర్ అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస
గత కొంతకాలంగా వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఎస్. జానకి గారు.. శనివారం (జూలై 11) మధ్యాహ్నం హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను మైసూరులోని అపోలో ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స (ICU) అందించినప్పటికీ, వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. శనివారం రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ఆమె ఈ లోకాన్ని వీడినట్లు ఆసుపత్రి వర్గాలు మరియు ఆమె మనవరాలు అప్సరా విద్యుల అధికారికంగా ప్రకటించారు.
సంగీత సామ్రాజ్యంలో ముగిసిన సువర్ణ అధ్యాయం
1957లో తమిళ చిత్రం 'విధియిన్ విలాయట్టు'తో కెరీర్ ప్రారంభించిన జానకమ్మ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరియు స్వరబ్రహ్మ ఇళయరాజాల కాంబినేషన్‌లో దక్షిణాది ఇండస్ట్రీని దశాబ్దాల పాటు శాసించారు. చిన్న పిల్లల గొంతు దగ్గర నుంచి వృద్ధుల గొంతు వరకు ఎలాంటి శబ్దాలనైనా అలవోకగా పలికించగల అద్భుత స్వర విన్యాసం ఆమె సొంతం. ఆమె మరణంతో యావత్ భారతీయ చిత్రసీమ శోకసంద్రంలో మునిగిపోయింది.

