Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
UNSC సంస్కరణలపై భారత్ తీవ్ర అసంతృప్తి: 17 ఏళ్ల ప్రతిష్టంభనకు తెరపడేదేప్పుడు?

UNSC సంస్కరణలపై భారత్ తీవ్ర అసంతృప్తి: 17 ఏళ్ల ప్రతిష్టంభనకు తెరపడేదేప్పుడు?

వార్త 1 week ago

India On UNSC Reform : ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) సంస్కరణల ప్రక్రియలో ఎలాంటి పురోగతి లేకపోవడంపై భారత్ తీవ్ర ఆగ్రహం మరియు అసంతృప్తిని వ్యక్తం చేసింది.

17 విడతల చర్చలు పూర్తయినా స్పష్టమైన ఫలితాలు రాకపోవడాన్ని తప్పుపడుతూ, కొన్ని దేశాల సంకుచిత స్వార్థ ప్రయోజనాల కోసం సంస్కరణల ప్రక్రియను బందీగా ఉంచకూడదని స్పష్టం చేసింది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (UNGA) మంగళవారం భద్రతా మండలి సంస్కరణలపై జరుగుతున్న అంతర్ ప్రభుత్వ చర్చలను (IGN) 81వ సమావేశానికి కొనసాగించాలని నిర్ణయించింది. దీనితో ఈ చర్చలు వరుసగా 18వ ఏడాదిలోకి ప్రవేశించాయి. 80వ ఐజీఎన్ సమావేశం కూడా గత సమావేశాల మాదిరిగానే ఎటువంటి పురోగతి లేక నిరాశ పరిచిందని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ పేర్కొన్నారు. సభ్య దేశాలు కేవలం తమ పాత వైఖరులను పునరావృతం చేస్తున్నాయే తప్ప, సంస్కరణల దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదని విమర్శించారు. న్యూయార్క్‌లో కూర్చుని పాత వాదనలే మళ్లీ చెప్పుకోవడం వల్ల సమర్థవంతమైన ఐక్యరాజ్యసమితిపై ప్రపంచ ప్రజల్లో నమ్మకం సడలుతోందని హెచ్చరించారు.

Read Also: Russia ,Ukraine War: ఉక్రెయిన్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. నౌకలో చిక్కుకున్న 13 మంది భారత నావికులు

 India On UNSC Reform

భారతీయ తత్వశాస్త్రంతో ఆసక్తికర పోలిక

ఈ సందర్భంగా పర్వతనేని హరీశ్ మాట్లాడుతూ, "భారతీయ తత్వశాస్త్రం ప్రకారం ఆత్మ అనేక జన్మలు ఎత్తి, క్రమంగా పురోగమిస్తూ చివరకు మోక్షాన్ని పొందుతుంది. భద్రతా మండలి సంస్కరణల చర్చలు ఇప్పటికే 17 చక్రాలు పూర్తి చేసుకున్నాయి. కానీ ఇప్పటికీ మోక్షం (ఫలితం) కనిపించడం లేదు. ప్రపంచం ఇంకా ఎంతకాలం వేచి చూడాలి?" అని ప్రశ్నించారు. ప్రస్తుత ప్రపంచ యథార్థాలు, పరిస్థితులకు అనుగుణంగా భద్రతా మండలిని సంస్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారత్ పునరుద్ఘాటించింది. శాశ్వత, తాత్కాలిక సభ్య దేశాల సంఖ్యను పెంచడంతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాలకు, ముఖ్యంగా గ్లోబల్ సౌత్ (Global South) కు తగిన ప్రాతినిధ్యం కల్పించాలి.నిర్దిష్ట కాలపట్టిక, స్పష్టమైన లక్ష్యాలతో కూడిన పాఠ్యాధారిత చర్చలే (Text-based negotiations) దీనికి సరైన మార్గం. భద్రతా మండలి సమగ్ర సంస్కరణల కోసం జరుగుతున్న ప్రయత్నాలకు భారత్ పూర్తి స్థాయిలో సహకరిస్తుందని, 81వ ఐజీఎన్ సమావేశాలు కొత్త ఆరంభానికి నాంది పలుకుతాయని ఆశాభావం వ్యక్తం చేసింది.

India On UNSC Reform : పశ్చిమాసియా ఉద్రిక్తతలు & ప్రాంతీయ పరిస్థితులపై స్పందన

మండలి సంస్కరణలతో పాటు పశ్చిమాసియాలో పెరుగుతున్న ఆందోళనకర పరిస్థితులపై భారత్ తన వైఖరిని స్పష్టం చేసింది: హర్మూజ్ జలసంధిలో నౌకలపై జరిగిన దాడులను ప్రస్తావిస్తూ, అంతర్జాతీయ జలమార్గాల్లో స్వేచ్ఛాయుత, నిరాటంక వాణిజ్యాన్ని తక్షణమే పునరుద్ధరించాలని కోరింది. హర్మూజ్ పరిస్థితులతో పాటు గాజాలోని తీవ్ర మానవతా సంక్షోభాన్ని విస్మరించకూడదని, ఇజ్రాయెల్‌తో శాంతియుత సహజీవనం చేసే స్వతంత్ర, సార్వభౌమ పాలస్తీనా దేశం ఏర్పాటే శాశ్వత పరిష్కారమని పేర్కొంది.: లెబనాన్ లోని ఐరాస శాంతి బలగాలపై (UN Peacekeepers) జరిగిన దాడులను తీవ్రంగా ఖండించింది. శాంతి బలగాల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని మరియు లెబనాన్ సాయుధ బలగాలకు అవసరమైన సహాయం అందించాలని పిలుపునిచ్చింది. 2028-29 కాలానికి గాను ఐరాస భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యత్వం కోసం భారత్ ఇప్పటికే తన అధికారిక ప్రచారాన్ని ప్రారంభించింది. వచ్చే ఏడాది జూన్‌లో జరిగే ఎన్నికల్లో ఆసియా-పసిఫిక్ విభాగంలో ఉన్న ఏకైక స్థానానికి భారత్, తజికిస్థాన్ మధ్య పోటీ నెలకొననుంది. భారత్ చివరిసారిగా 2021-22 కాలంలో భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా పనిచేసింది. అంతకుముందు మొత్తం 7 సార్లు ఈ బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించింది.

భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha