AP Rain Alert: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారినట్లు భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఇది ఒడిశాలోని పారాదీప్ - పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశం ఉండటంతో, తీర ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు.

తీవ్ర రూపం దాల్చుతున్న వాయుగుండం – తీరంలో బలమైన ఈదురుగాలులు
ఈ వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారి పెద్ద ఎత్తున అలలు ఎగిసిపడే ప్రమాదం ఉంది. జులై 29 వరకు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) అంచనా వేస్తోంది. రాబోయే 24 గంటల్లో ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే సూచనలున్నాయి.
AP Rain Alert: మత్స్యకారులకు హెచ్చరికలు – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
వాతావరణ పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లరాదని ప్రభుత్వం కఠిన హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, చెట్లు, విద్యుత్ స్తంభాలు అలాగే శిథిలావస్థలో ఉన్న భవనాల వద్ద ఉండొద్దని సూచించారు.
Epaper: epaper.vaartha.com

