Atal Bihari : మాజీ ప్రధాని, భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయీ స్మారకార్థం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల 'అటల్ కాంప్లెక్స్'ల (అటల్ ) నిర్మాణాలను చేపట్టింది.
ఈ క్రమంలో దేశనేత గౌరవార్థం ప్రతీ కాంప్లెక్స్‌లోనూ అత్యంత నాణ్యమైన కాంస్య (Bronze) విగ్రహాలను ప్రతిష్టించేందుకు ఒక్కో విగ్రహానికి రూ. 14 లక్షల చొప్పున భారీగా నిధులను కేటాయించింది. అయితే, ఈ ప్రాజెక్టు కాంట్రాక్ట్ దక్కించుకున్న కాంట్రాక్టర్ కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా, అధికారుల కంటిముందే నిధులను పక్కదారి పట్టించినట్లు స్పష్టమవుతోంది. అగ్రనేత పేరుతో చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో భారీగా నిధులు దుర్వినియోగం కావడం పట్ల స్థానికులు, ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

వర్షాలకు ఊడిన రంగు పెచ్చులు: బహిర్గతమైన నాసిరకం సిమెంట్ విగ్రహం భాగోతం!
కోర్బా జిల్లాలోని కాటేఘోరా (Katghora) అటల్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన విగ్రహానికి కాంస్య లోహానికి బదులుగా కేవలం సిమెంట్‌తో విగ్రహాన్ని తయారు చేసి, పైన కాంస్యపు రంగు పూసినట్లు బయటపడింది. ఇటీవల కురిసిన వర్షాలకు విగ్రహానికి ఉన్న రంగు పెచ్చులూడిపోవడంతో అసలు సిమెంట్ విగ్రహం ప్రత్యక్షమై ఈ ఘోర అవినీతి వెలుగులోకి వచ్చింది. స్థానిక బిజెపి మోర్చా మండల అధ్యక్షుడే ఈ నిర్మాణ కాంట్రాక్టర్‌గా వ్యవహరించడం మరియు దీనిపై సొంత పార్టీ నేతలతో సహా ప్రతిపక్షాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవడంతో ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపింది. తీవ్రస్థాయిలో వెల్లువెత్తిన విమర్శలతో స్పందించిన ఉన్నతాధికారులు ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

