Varanasi Cricket Stadium : ఆధ్యాత్మిక నగరం వారణాసిలో నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం దేశంలోనే అత్యంత ప్రత్యేకమైన క్రీడా వేదికగా రూపుదిద్దుకుంటోంది.
క్రికెట్ అభిమానులను మాత్రమే కాదు, భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా ఈ స్టేడియాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవల ఈ (Varanasi Cricket Stadium) స్టేడియానికి సంబంధించిన కొన్ని ఫొటోలు బయటకు రావడంతో అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాశీ విశ్వనాథుడి వైభవాన్ని ప్రతిబింబించేలా :
ఈ స్టేడియం రూపకల్పనలో కాశీ విశ్వనాథుడి వైభవాన్ని ప్రతిబింబించేలా ప్రతి అంశాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ముఖ్యంగా స్టేడియంలోని ఫ్లడ్ లైట్లను త్రిశూలం ఆకారంలో రూపొందించడం విశేషం. అలాగే మీడియా సెంటర్‌ను డమరుకం ఆకృతిలో నిర్మిస్తున్నారు. శివుడికి సంబంధించిన ఈ ప్రతీకలు స్టేడియానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

ప్రేక్షకుల కోసం ఏర్పాటు చేస్తున్న సీటింగ్ కూడా వారణాసి ఘాట్‌లను తలపించేలా మెట్ల తరహాలో రూపొందిస్తున్నారు. దీంతో స్టేడియంలోకి అడుగుపెట్టిన వారికి కాశీ ఘాట్‌ల అనుభూతి కలిగేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఆధునిక సౌకర్యాలు, భారతీయ సంప్రదాయం కలయికగా ఈ స్టేడియం నిలవనుంది.
సాంకేతికంగా కూడా ఈ వేదిక అత్యాధునికంగా ఉండబోతోంది. వర్షం కురిసిన తర్వాత కేవలం 30 నిమిషాల్లోనే మైదానాన్ని మ్యాచ్‌కు సిద్ధం చేసే అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో వర్షం కారణంగా మ్యాచ్‌లకు అంతరాయం తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ స్టేడియంలో ఒకేసారి 32 వేల మంది ప్రేక్షకులు మ్యాచ్‌ను వీక్షించేలా సీటింగ్ సామర్థ్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆధునిక సదుపాయాలు, ప్రత్యేక డిజైన్, శివుడి ప్రతీకలను ప్రతిబింబించే నిర్మాణ శైలి కలగలిసి వారణాసి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం భారత క్రికెట్‌లో ఒక ఐకానిక్ వేదికగా నిలవనుందని క్రీడా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

