Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వారణాసి' చిత్రంతో బిజీగా ఉన్నారు. భారీ బడ్జెట్, అంతర్జాతీయ స్థాయి కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు సొంతం చేసుకుంది.
ఈ చిత్రం విడుదల (Mahesh Babu) తర్వాత మహేష్ కెరీర్ మరో స్థాయికి చేరుకుంటుందని అభిమానులు, సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు ఎవరితో సినిమా చేస్తారన్న అంశం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
సందీప్ రెడ్డి వంగతో మహేష్ :
ఒకవైపు ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో మహేష్ సినిమా చేయనున్నట్లు బలమైన ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తే అది పూర్తిస్థాయి పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ఉండే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు ‘ఉప్పెన’తో దర్శకుడిగా సత్తా చాటిన బుచ్చిబాబు సానా కూడా మహేష్ కోసం ఓ పవర్‌ఫుల్ కథ సిద్ధం చేస్తున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. భావోద్వేగాలతో పాటు కమర్షియల్ అంశాలు మేళవించిన కథలను తెరకెక్కించడంలో బుచ్చిబాబు ప్రత్యేక శైలి చూపించారు. దీంతో ఆయనకు కూడా మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. అయితే రాజమౌళి సినిమా తర్వాత మహేష్ మార్కెట్, ఇమేజ్ పూర్తిగా మారే అవకాశం ఉంది.
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పెరిగితే ఆయన ఎంచుకునే కథలు, దర్శకులు, ప్రాజెక్టుల స్థాయి కూడా మరింత భారీగా ఉండొచ్చు. అందుకే తదుపరి సినిమాపై మహేష్ చాలా ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం సందీప్ వంగ, బుచ్చిబాబు పేర్లు బలంగా వినిపిస్తున్నప్పటికీ, మహేష్ నుంచి లేదా ఆయన టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ‘వారణాసి’ తర్వాత మహేష్ బాబు తదుపరి సినిమా ఎవరితో ఉంటుందన్న ఉత్కంఠ అభిమానుల్లో మరింత పెరుగుతోంది.

