Kala Venkata Rao Press Meet: బొబ్బిలి పట్టణంలో ఒక ప్రైవేటు ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న 'మాజీ మంత్రివర్యులు, చీపురుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ కళా వెంకట్రావు' గారు, 'ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన' గారు..
బొబ్బిలి కోటలో మీడియాతో మాట్లాడిన చీపురుపల్లి ఎమ్మెల్యే శ్రీ కళా వెంకట్రావు గారు, ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు..
ఈరోజు ఉదయం బొబ్బిలి పట్టణం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరలో శ్రీ సాయి కృప ఆసుపత్రి ప్రారంభోత్సవం కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు, చీపురుపల్లి నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు శ్రీ కళా వెంకట్రావు గారు, బొబ్బిలి నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన) గారు పాల్గొనడం జరిగింది.. అనంతరం, బొబ్బిలి కోటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇరువురు పాల్గొన్నారు.
Read Also : School holidays: అలర్ట్.. రేపటి నుంచి 3 రోజుల పాటు స్కూళ్లకు హాలిడే!
Kimidi Kala Venkatarao was angry at the criticism of YCP
Kala Venkata Rao Press Meet: కూటమి ప్రభుత్వంపై వైసీపీ తప్పుడు ప్రచారాలు
మాజీ మంత్రివర్యులు, చీపురుపల్లి నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు శ్రీ కళా వెంకట్రావు గారు మాట్లాడుతూ, వైసీపీ నాయకులు వారి ఉనికికోసం కూటమి ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.. వైసీపీ హయాములో రాష్ట్రం ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారాలు చేస్తూ తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.. కూటమి ప్రభుత్వం వచ్చాక, తాము మాట ఇచ్చిన విధంగా 16 వేల డీఎస్సీ పోస్టులు భర్తీ చేశామనితెలిపారు..ఒకటిన్నర సంవత్సరం గడిచాక ఇప్పుడు కల్పిత వీడియోలు, అబద్ధపు వ్యక్తులను ద్వారా ప్రభుత్వంపై ఏదో ఒకవిధంగా బురద జల్లి, మేము చేస్తున్న అభివృద్ధి వైపు నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి విశ్వప్రయత్నాలను చేస్తున్నారని అన్నారు.. వారు ఎన్ని కుట్రలు చేసినా, విచారణలో వాస్తవాలు బయటకు వచ్చాయని తెలిపారు.. వైసీపీ వారికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన ఎప్పుడూ లేదని, వైసీపీ వారి హయాములో రాష్ట్రంలో ప్రజలకు, మీడియా వారికి, ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ ఉండేది కాదని ఆవేదన వ్యక్తంచేశారు..
దళిత డ్రైవర్ సుధాకర్ ను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టుకున్నారని, డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగిన పాపానికి అతనిని మానసికంగా వేదనకు గురిచేసి వారి మరణానికి కారణమైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి పరిపాలనను నాశనం చేశారని విమర్శించారు.. రామతీర్థాలలో శ్రీరాముడు విగ్రహం యొక్క తలను కొందరు దుండగులు విరగ్గొడితే, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు, మేము వెళ్లి ఆ ప్రాంతాన్ని చూసి, జరిగిన సంఘటన గురించి ప్రశ్నిస్తే.. విజయసాయిరెడ్డి గారుపై హత్యా ప్రయత్నం చేశామని మాపై దొంగ కేసులు నమోదు చేసిన ఘనత వైసీపీ వారిది అని ఆవేదన వ్యక్తంచేశారు.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత, “సంక్షేమం – అభివృద్ధి” ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా జరుగుతున్నాయని, ప్రాంతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో సభలను ఏర్పాటు చేసి తాము చేస్తున్న అభివృద్ధి గురించి ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు..వైసీపీ పాలనలో వారి ఎమ్మెల్యేలు, మంత్రులు బూతు పురాణాలు తప్ప రాష్ట్ర అభివృద్ధి గురించి ఎన్నడూ మాట్లాడలేదని, తాము అధికారంలోకి వచ్చాక కొత్తగా తెచ్చిన పరిశ్రమలు, ఉద్యోగాల కల్పనలు గురించి మాత్రమే మాట్లాడుతున్నామని గుర్తుచేశారు.. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి ఎంతో సహకరిస్తుందని అందుకు ఉదాహరణ నక్కపల్లి స్టీల్ ప్లాంట్, విశాఖ డేటా సెంటర్, విశాఖలో గూగుల్ సంస్థ ఏర్పాటు, ఇలా ఎన్నో పరిశ్రమలు స్థాపించి యువతకు బంగారు భవిష్యత్తు కల్పించే దిశగా గౌరవ టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ నారా లోకేష్ గారు అడుగులు వేస్తున్నారని అన్నారు.

కూటమిని ఎవరూ విడగొట్టలేరు
అలాగే, వైసీపీ, జనసేన పార్టీల కాపు సామాజిక నాయకుల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం గురించి విలేఖరులు ప్రశ్నించగా, వైసీపీ వారు తమ రాజకీయ ప్రయోజనాల కోసం కులాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుతున్నారని విమర్శించారు.. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారుని ఏ ఒక్క కులానికో పరిమితం చేయడం సరికాదని, ఒక పార్టీకి నాయకుడిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్ని కులాల వారిని అన్ని మతాల వారిని సమానంగా చూస్తూ ఎంతో భాద్యతగా పనిచేస్తున్నారని స్పష్టత ఇచ్చారు.. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా కూటమిని విడగొట్టలేరని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు.
కిమిడి కుటుంబంతో మాది 4 తరాల అనుబంధం: ఎమ్మెల్యే బేబీనాయన
అనంతరం, ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు మాట్లాడుతూ బొబ్బిలి రాజకుటుంబం, కిమిడి వారి కుటుంబానిది 4 తరాల అనుబంధం అని గుర్తుచేశారు.. తమ కుటుంబం ఈరోజు టీడీపీ లోకి రావడానికి, ఒక నిబద్ధత కలిగిన అధినాయకత్వంతో కలిసి పనిచేయడానికి ముఖ్య కారణం శ్రీ కిమిడి కళా వెంకట్రావు గారు అని చెప్పడం తనకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.. తాను రాజకీయపరమైన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు పెద్దలు శ్రీ కళా వెంకట్రావు గారిని సంప్రదిస్తానని, వారు తమ అనుభవంతో మమ్మల్ని సరైన మార్గంలో వెళ్ళేలా సలహాలు ఇస్తారని తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ సీనియర్ నాయకులు అల్లాడ భాస్కర్రావు గారు, చింతల రామకృష్ణ గారు, బొబ్బిలి పట్టణ టీడీపీ అధ్యక్షులు గెంబలి శ్రీనివాసరావు గారు, బొబ్బిలి మండలం టీడీపీ అధ్యక్షులు వాసిరెడ్డి సత్యనారాయణ గారు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

