Venkatramaiah Gari Taluka Event: తెలంగాణ రక్షణ సేన పార్టీ అధినేత కవిత తాజాగా దినేశ్ కుమార్, దివిజ ప్రభాకర్ జంటగా నటించిన వెంకట్రామయ్య గారి తాలూకా అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ చిన్న సినిమా నిర్మాతలకు తమ పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని, భవిష్యత్తులో రాష్ట్రాన్ని నడిపించే అవకాశం వస్తే వారి ప్రయోజనాల కోసం సరికొత్త సినీ విధానాన్ని తీసుకువస్తామని తెలంగాణ రక్షణ సేన నాయకురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఈ వేడుకలో చిత్ర సంగీత దర్శకుడు చరణ్ అర్జున్‌ను ఉద్దేశించి ఆమె సరదాగా చేసిన వ్యాఖ్యలు అటు రాజకీయ, ఇటు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
Read Also : Telangana Schools: తెలంగాణ స్కూళ్లలో జూలై 18న పేరెంట్స్ మీటింగ్!
Kavitha attended the pre-release event of ‘Venkatramayya Gari Taluka’.
చిత్ర సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ ప్రతిభను కవిత ప్రత్యేకంగా అభినందించారు. అయితే, ఆయనపై తనకు కాస్త కోపం, అలక ఉన్నాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “చరణ్ అర్జున్ స్వరపరిచిన 'మూడు రంగుల జెండా' పాట ఇటీవలి ఎన్నికల్లో ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసేంతగా ప్రజాదరణ పొందింది. అంతటి శక్తిమంతమైన పాటను అందించినందుకే ఆయనపై నాకు కాస్త అలక ఉంది” అని సరదాగా పేర్కొన్నారు. ఈ సినిమా పాటలు కూడా అదే స్థాయిలో ప్రజాదరణ పొందాలని ఆమె ఆకాంక్షించారు.
Venkatramaiah Gari Taluka Event: రాష్ట్రాలు వేరైనా తెలుగు ప్రజలంతా ఒక్కటే
సినిమా టైటిల్‌లోని ‘తాలూకా’ అనే పదంపై స్పందిస్తూ, తెలంగాణలో ఈ పదం అంతగా వాడుకలో లేదని కవిత గుర్తుచేశారు. “ఈ పేరు విన్నప్పుడు కాస్త భిన్నంగా అనిపించినా, భౌగోళికంగా రాష్ట్రాలు విడిపోయినా తెలుగు ప్రజలంతా ఒక్కటేనని, మనమంతా కలిసి ఉండాలన్నదే మా ఆకాంక్ష” అని అన్నారు. ఇరు ప్రాంతాల సంస్కృతులను పరస్పరం గౌరవించుకున్నప్పుడే భాష, సంస్కృతులు నిలబడతాయని, తెలుగు చిత్రసీమ మనందరినీ కలిపే ఒక గొప్ప మాధ్యమంగా నిలవాలని పిలుపునిచ్చారు.

చిన్న నిర్మాతల కష్టాలు.. సరికొత్త సినీ విధానానికి హామీ
చిత్ర పరిశ్రమలో చిన్న నిర్మాతలు ఎదుర్కొంటున్న సవాళ్లపై కవిత ఆందోళన వ్యక్తం చేశారు. “తమిళ, కన్నడ పరిశ్రమల మాదిరిగా మన దగ్గర చిన్న నిర్మాతలకు, థియేటర్లకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందడం లేదు. ఓటీటీలు కూడా వ్యాపార ధోరణిలోనే నడుస్తున్నాయి” అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తులు అమ్మి సినిమాలు తీసే చిన్న నిర్మాతలు బాగుంటేనే చిత్ర పరిశ్రమ బాగుంటుందని స్పష్టం చేసిన ఆమె.. భవిష్యత్తులో తమకు అధికారం లభిస్తే చిన్న చిత్రాల మనుగడకు మేలు చేసేలా ఒక బలమైన సినీ విధానాన్ని రూపొందిస్తామని హామీ ఇచ్చారు.
కుటుంబ బంధాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో దినేశ్ కుమార్ హీరోగా నటించగా, ప్రముఖ నటుడు ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. సతీశ్ ఆవాల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల (జూలై) 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

