Ponnam Prabhakar: కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ తప్పుకోవడం కేవలం ఒక పరిణామం కాదని, అది విద్యార్థి లోకం మరియు ఉద్యమకారులు సాధించిన గొప్ప విజయమని తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభివర్ణించారు.
కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో ఇది లభించిన తొలి ఘన గెలుపు అని ఆయన పేర్కొన్నారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నాయకత్వంలో సాగిన పోరాటం, దేశవ్యాప్తంగా విద్యార్థులు ప్రదర్శించిన అపూర్వ ఐక్యత కారణంగానే కేంద్ర మోదీ ప్రభుత్వం తలవంచక తప్పలేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఏ ప్రభుత్వమైనా యువత, విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటే ఎలాంటి గుణపాఠం ఉంటుందో ఈ ఘటన చాటిచెప్పిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.

Read also: Dharmendra Pradhan Resignation: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై స్పందించిన కిషన్ రెడ్డి
బీజేపీ ప్రభుత్వ పతనానికి ఇదే తొలి మెట్టు: కేంద్ర తీరుపై మంత్రి విమర్శలు
కేంద్రంలోని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ పతనానికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే తొలి అడుగు అని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా విమర్శించారు. శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న విద్యార్థుల గొంతును నొక్కేసేందుకు కేంద్రం విఫలయత్నాలు చేసిందని మండిపడ్డారు. నిరసనలను అణచివేసే దురుద్దేశంతో విద్యుత్ సరఫరాను నిలిపివేయడం, మెట్రో రైలు సేవలను బంద్ చేయడం, పోలీసులతో లాఠీఛార్జీలు చేయించడం వంటి దుశ్చర్యలకు పాల్పడినప్పటికీ.. వేలాది మంది విద్యార్థులు వెనుకంజ వేయకుండా ఆందోళనలో పాల్గొనడం కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఉన్న తీవ్ర ప్రజా ఆగ్రహానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. అచంచల దీక్షతో పోరాడి విజయం దక్కించుకున్న విద్యార్థులందరికీ ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ ప్రజా వ్యతిరేక విధానాలపై అందరూ ఐక్యంగా నిలబడి పోరాడాలని పిలుపునిచ్చారు.

