Delhi High Court: వృద్ధ తల్లిదండ్రులను సరిగా చూసుకోకపోవడం, వారిని అవమానించడం వంటి పరిస్థితుల్లో తమ సొంత ఇంటి నుంచి పిల్లలు, చట్టపరమైన వారసులను ఖాళీ చేయించే అధికారం వృద్ధులకు ఉందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.
తల్లిదండ్రులు, వృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం-2007 కింద ఈ అధికారం చెల్లుబాటు అవుతుందని పేర్కొంది. వృద్ధులు తమ ఇంటి నుంచి పిల్లలు లేదా ఇతర వారసులను ఖాళీ చేయించుకోవాలంటే జిల్లా కలెక్టర్ లేదా సంబంధిత డివిజనల్ కమిషనర్‌ను ఆశ్రయించాలని కోర్టు సూచించింది. ఈ చట్టం ఉద్దేశం వృద్ధులకు సురక్షితమైన, గౌరవప్రదమైన జీవనాన్ని కల్పించడమేనని పేర్కొంది.

కుటుంబ వివాదం నేపథ్యంలో తీర్పు
ఓ కుటుంబ వివాదానికి సంబంధించిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కారియా ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. పూనం అనే మహిళ తన అత్తింటి వారిపై గృహ హింస చట్టం కింద కేసు దాఖలు చేసి, అత్తగారి ఇంట్లో నివసించే హక్కు కల్పించాలని కోరారు. అయితే, తనను సరిగా చూసుకోవడం లేదని ఆరోపిస్తూ పూనం అత్త సీనియర్ సిటిజన్ చట్టం కింద డివిజనల్ కమిషనర్‌ను ఆశ్రయించారు. పూనంను ఇంటి నుంచి ఖాళీ చేయించాలని ఆమె కోరారు. దీనిపై డివిజనల్ కమిషనర్ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ పూనం హైకోర్టును ఆశ్రయించారు.
కోడలిని కూడా ఖాళీ చేయించవచ్చు
ఈ కేసును విచారించిన హైకోర్టు.. ఢిల్లీ ప్రభుత్వం 2009లో రూపొందించిన సంబంధిత నిబంధనలు చట్టబద్ధమైనవేనని తేల్చింది. ఈ నిబంధనల ప్రకారం వృద్ధులు తమ ఆస్తి నుంచి కుమారుడు, కుమార్తెతో పాటు ఇతర చట్టపరమైన వారసులను, అవసరమైతే కోడలిని కూడా ఖాళీ చేయించవచ్చని పేర్కొంది. పిటిషనర్ పూనం ఉద్యోగం చేస్తూ ఆదాయం పొందుతున్నారని, ఆమెకు మరో ఇల్లు కూడా ఉందని కోర్టు విచారణలో గుర్తించింది.
Delhi High Court: వృద్ధుల ప్రశాంత జీవన హక్కుకు ప్రాధాన్యం
"భాగస్వామ్య గృహంలో నివసించే హక్కు అపరిమితం కాదు. వృద్ధురాలు తన జీవిత చరమాంకంలో ప్రశాంతంగా జీవించే హక్కుకు భంగం కలిగించకూడదు" అని కోర్టు వ్యాఖ్యానించింది. గృహ హింస చట్టం కింద ఉన్న హక్కులను, సీనియర్ సిటిజన్ చట్టం కింద వృద్ధులకు కల్పించిన హక్కులను పరస్పరం సమన్వయంతో చూడాల్సిన అవసరం ఉందని ధర్మాసనం పేర్కొంది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను కూడా హైకోర్టు ప్రస్తావించింది.

