YogAndhra-2026: భారతదేశం ప్రపంచానికి అందించిన అద్భుతమైన జీవన శైలి యోగా అని, దానిని ఒక ప్రజా ఉద్యమంగా మలిచి ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించడమే తమ ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
అమరావతిలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ (జూన్ 21) ప్రణాళికలను ఆయన వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు కోటి మందిని భాగస్వాములను చేస్తూ ఈ ఏడాది 'యోగాంధ్ర-2026'ను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

Read also: YS Jagan: డీఎస్సీ అభ్యర్థులకు అండగా ఉంటామంటూ వైఎస్ జగన్ భరోసా
ఈ ఏడాది థీమ్: ‘యోగా ఫర్ హెల్తీ ఏజింగ్’
వృద్ధాప్యంలోనూ సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలనే సందేశాన్ని ఇచ్చేలా ఈ సంవత్సరం ‘యోగా ఫర్ హెల్తీ ఏజింగ్’ అనే థీమ్‌తో కార్యక్రమాలను రూపొందించారు. యోగా అనేది కేవలం ఒక్కరోజుకే పరిమితం కాకుండా, ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగం కావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని సీఎం పేర్కొన్నారు. ఈ క్రమంలోనే జూన్ నెలను ‘యోగా మాసం’గా ప్రకటిస్తూ.. జూన్ 7 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రమంతటా విస్తృతంగా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు.
YogAndhra-2026: అమరావతి బైపాస్ వంతెనపై ప్రధాన వేడుక
మెగా ఈవెంట్ అమరావతిలోని కృష్ణానది పశ్చిమ బైపాస్ వంతెనపై 25 వేల మందితో ప్రధాన కార్యక్రమం జరగనుంది. ప్రతి జిల్లా కేంద్రంలో 2 వేల నుంచి 3 వేల మంది భాగస్వామ్యంతో వేడుకలు ఉంటాయి. ఎన్‌టీఆర్ జిల్లాలో పోలీస్ సిబ్బంది, కోనసీమలో రైతులు వంటి ప్రత్యేక వర్గాలతో యోగా సెషన్స్ ఉంటాయి. ఉండవల్లి గుహలు, శ్రీశైలం వంటి రాష్ట్రంలోని 56 ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో యోగా ప్రదర్శనలు ఏర్పాటు చేసి టూరిజంను ప్రమోట్ చేయనున్నారు.
స్వర్ణాంధ్ర-2047 విజన్.. ప్రత్యేక బడ్జెట్
ఈ భారీ కార్యక్రమ నిర్వహణ కోసం ప్రభుత్వం రూ. 10 కోట్ల ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించింది. ‘స్వర్ణాంధ్ర-2047’ లక్ష్యాల్లో భాగంగా రాష్ట్రంలో 10 లక్షల మంది సర్టిఫైడ్ యోగా సాధకులను, 2.50 లక్షల మంది ప్రత్యేక యోగా శిక్షకులను (ట్రైనర్స్) తయారు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ మహత్కార్యం కోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఇషా ఫౌండేషన్, బ్రహ్మకుమారీస్ వంటి ఆధ్యాత్మిక, స్వచ్ఛంద సంస్థల మద్దతు తీసుకుంటున్నట్లు తెలిపారు.
వాట్సాప్ ద్వారా యోగా వీడియోలు, ఆన్‌లైన్ పోర్టల్
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు సలహాలతో రూపొందించిన 168కి పైగా యోగా శిక్షణ వీడియోలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.
ఉచిత వీడియోల కోసం ప్రజలు 81424 04888 నంబర్‌కు వాట్సాప్‌లో ‘Hi’ అని మెసేజ్ పంపి ఈ వీడియోలను పొందవచ్చు. ఈ కార్యక్రమాల సమాచారం, రిజిస్ట్రేషన్ల కోసం ప్రత్యేకంగా yogandhra.ap.gov.in అనే పోర్టల్‌ను ప్రారంభించారు. గతేడాది యోగాంధ్ర కార్యక్రమానికి దాదాపు 2.44 కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నారని, అదే ఉత్సాహంతో ఈసారి కూడా ప్రజలంతా భాగస్వాములై ఈ 365 రోజుల నిరంతర ఆరోగ్య ఉద్యమాన్ని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:
డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదు: హోంమంత్రి అనిత

