UPI: యూపీఐ (UPI) చెల్లింపులపై వస్తున్న కథనాలపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) స్పష్టతనిచ్చింది. వ్యక్తుల మధ్య జరిగే (P2P) లావాదేవీలు మరియు (RuPay) డెబిట్ కార్డ్ సేవలపై ఎలాంటి ఛార్జీలు ఉండవని, అవి పూర్తిగా ఉచితమని వెల్లడించింది.
అలాగే వ్యక్తులు, వ్యాపారుల మధ్య జరిగే (P2M) చెల్లింపుల్లో 96 శాతం ఉచితంగానే సాగుతాయని తెలిపింది. ప్రభుత్వ సేవలకు సంబంధించి రూ.2,000 వరకు చేసే డిజిటల్ చెల్లింపులపై కూడా ఎలాంటి రుసుము వసూలు చేయడం లేదని వివరణ ఇచ్చింది.

ఎమ్‌డీఆర్ ఛార్జీలు, పెట్టుబడుల ప్రోత్సాహం
రూ.2,000 దాటిన ప్రభుత్వ సేవల లావాదేవీలపై మాత్రమే రూ.5 చొప్పున మెర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) వర్తిస్తుందని ఎన్‌పీసీఐ పేర్కొంది. మన దేశీయ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను సుదీర్ఘకాలం నిలకడగా కొనసాగించడంతో పాటు, భారతీయ ఫిన్‌టెక్ రంగంలోకి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికే ఈ ఎమ్‌డీఆర్ విధానం ఉపకరిస్తుందని స్పష్టం చేసింది. ఈ స్పష్టతతో సాధారణ వినియోగదారులకు, చిన్న వ్యాపారులకు యూపీఐ ఉచిత సేవలపై ఉన్న సందేహాలు నివృత్తి అయ్యాయి.

