Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆల్‌టైమ్ కనిష్ఠానికి పడిపోయిన రూపాయి

ఆల్‌టైమ్ కనిష్ఠానికి పడిపోయిన రూపాయి

VIDHATHA 1 week ago

డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తొలిసారి రూ.96.07కి పడిపోయింది. క్రూడాయిల్ ధరల పెరుగుదలతో దిగుమతులు ఖరీదై ద్రవ్యోల్బణ ఒత్తిడి పెరుగుతోంది.

అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ భారీగా పతనం అయ్యింది.

గతంలో ఎన్నడూ లేనివిధంగా డాలర్‌ విలువ తొలిసారి రూ.96.07 మార్కును దాటింది. గురువారం ట్రేడింగ్‌ సెషన్‌లో 95.96 వద్ద కనిష్ఠాన్ని తాకిన రూపాయి విలువ.. శుక్రవారం మధ్యాహ్నం 96.07 కనిష్ఠాన్ని తాకింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరల పెరుగుదల నేపథ్యంలో మన రూపాయిపై ఒత్తిడి పెరుగుతోంది.

నరేంద్ర మోదీ పీఎంగా మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసిన రోజు డాలర్‌తో రూపాయి మారకం విలువ 58.44గా ఉండటం గమనార్హం. రూపాయి విలువ పతనమైతే.. దిగుమతి చేసుకునే వంట నూనెలు, చమురు, సహజవాయువు, ఎలక్ట్రానిక్స్, బంగారం, లగ్జరీ కార్లు, గడియారాలు మరింత ఖరీదుకానున్నాయి. నిత్యావసరాల ధరలు పెరుగనున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగి, ప్రజల కొనుగోలు శక్తి క్షీణిస్తుంది. విదేశీ ఉన్నతవిద్య కోసం తమ పిల్లల్ని పంపిన తల్లిదండ్రులపై భారం పెరుగుతుంది.అయితే మన దేశం నుంచి వస్తువులు, సేవలు ఎగుమతి చేసేవారికి మాత్రం లాభం కలుగుతుందని ఆర్థిక నిపుణులు వెల్లడిస్తున్నారు. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్ ధర 108 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ఔన్సు 4,560 వద్ద ట్రేడవుతోంది.

ఈ ఏడాది ఇప్పటివరకు రూపాయి 6 శాతానికి పైగా నష్టాలను నమోదు చేసింది. ఇరాన్ యుద్ధ ప్రమాదం పెరగడంతో ముడిచమురు ధరలు పెరగడంతో గత ఆరు ట్రేడింగ్ సెషన్లలో రూపాయి దాదాపు 2 శాతం క్షీణించింది. బలమైన అమెరికా రిటైల్ అమ్మకాలు, స్థిరమైన కార్మిక మార్కెట్ డేటా, ఫెడరల్ రిజర్వ్ భారీగా వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలను తగ్గించడంతో డాలర్ సూచీ పెరిగింది. ప్రపంచ అనిశ్చితులు, సాపేక్షంగా అధిక విలువలు, ఏఐ ఆధారిత పెట్టుబడి అవకాశాల కొరత వంటివి మూలధన ప్రవాహాలపై భారం మోపాయని ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు.

మరోవైపు దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు, ఆఖర్లో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొని నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరగడం, డాలరుతో రూపాయి మారకం విలువ తొలిసారి 96 మార్కును దాటడం మార్కెట్​ ను దెబ్బతీసింది. దీంతో పాటు మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో రెండు రోజుల వరుస లాభాలకు బ్రేక్‌ పడింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: VIDHATHA