Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏటీఎంలు ఖాళీ? బ్యాంకులను వేధిస్తున్ననగదు కొరత.. గ్రామీణ రైతుల అవస్థలు

ఏటీఎంలు ఖాళీ? బ్యాంకులను వేధిస్తున్ననగదు కొరత.. గ్రామీణ రైతుల అవస్థలు

VIDHATHA 1 week ago

తెలంగాణలోని అనేక బ్యాంకులు ప్రస్తుతం తీవ్ర నగదు కొరతను ఎదుర్కొంటున్నాయి. ఒక మోస్తరు పట్టణంలోని ప్రజల నగదు అవసరాలకు కోటి రూపాయల దాకా అవసరం ఉంటుంటే..

బ్యాంకులకు పది లక్షలకు మించి నగదు అందడం లేదు. దీంతో ప్రజలకు అవసరమైనదానికంటే చాలా తక్కువ మొత్తంలోనే చెల్లిస్తున్నారు. బ్లాక్‌ మనీ రూపంలో పెద్ద మొత్తంలో కరెన్సీ పోగుపడి ఉండటం కూడా మార్కెట్‌లో కరెన్సీ చెలామణి తగ్గడానికి ఒక కారణంగా చెబుతున్నారు.

విధాత, హైదరాబాద్‌:

ఇది ఒక్క సూర్యాపేట, నల్లగొండల్లోని సమస్యేకాదు.. తెలంగాణలోని అనేక పట్టణ కేంద్రాలలో ఇదే పరిస్థితి ఉందని బ్యాకర్లు చెబుతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక చిన్న పట్టణంలోని ఒక జాతీయ బ్యాంకు మేనేజర్ మాట్లాడుతూ తమకు ప్రతి రోజు కోటి రూపాయల నగదు అవసరం అవుతుందని, కానీ రూ.10 లక్షల నగదు మాత్రమే తమకు అందుబాటులోకి వస్తున్నదని చెప్పారు. ఫలితంగా నగదు కోసం వచ్చే కస్టమర్లకు వారి అవసరం మేరకు నగదు ఇవ్వలేక పోతున్నామని తెలిపారు. చాలా మంది ఖాతాదారులు అంతా రైతులేనని, వారికి నిత్యం నగదు అవసరం అవుతుందని సదరు బ్యాంకు మేనేజర్ చెప్పారు. తమ ఖతాలోని సొమ్ము ఇవ్వాలని అడిగితే.. క్యాష్‌ లేదని ఎందుకు చెబుతున్నారంటూ రైతులు తమను నిలదీస్తున్నారని ఆయన వాపోయారు. దేశంలో నగదు కొరత ఉందని రిజర్వు బ్యాంకు ఎలాంటి అధికారిక ప్రకటనలు చేయకపోయినా ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. జాతీయ బ్యాంకులలో అతి ప్రధానమైన ఎస్‌బీఐ కూడా నగదు కొతర ఉన్నట్లు అధికారికంగా ప్రకటన చేయలేదు. కానీ చాలా బ్యాంకు బ్రాంచీలల్లో మాత్రం కొరత ఉన్నట్లు సమాచారం.

దేశంలో బ్లాక్‌మనీ ఎకానమీ చాలా పెద్దదని ఆర్థిక నిపుణుల అంచనా. 2014కు ముందుకు బీజేపీ దేశవ్యాప్తంగా నల్లధనానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించింది. విదేశాలలో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకు వచ్చి దేశంలో పేదల బ్యాంకు ఖాతాలలో రూ.15 వేల చొప్పున డిపాజిట్ చేస్తానని ప్రకటించింది. 2014 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టడానికి ఈ హామీ ప్రధాన కారణమైంది. దేశంలో బ్లాక్ ఎకానమీ దేశ జీడీపీలో 20 నుంచి 30 శాతం వరకు ఉండ వచ్చునని ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ ఆర్థిక వేత్తలు అంచనా వేశారు. దేశ జీడీపీ దాదాపు 350 లక్షల కోట్లకు పైగా ఉన్నది. దీని ప్రకారం పరిశీలిస్తే దేశంలో నల్ల ధనం రూ.60 లక్షల కోట్ల నుంచి రూ.100 లక్షల కోట్ల వరకు ఉండ వచ్చునని అంచనా. ఈ నల్లధనంతో రియల్ ఎస్టేట్, బంగారం, బినామి ఆస్తుల కొనుగోళ్లు, విదేశీ ఖాతాలు, హవాలా లావాదేవీల రూపంలో జరుగుతాయని అంటున్నారు. ఇలాంటి లావాదేవీల వల్ల బ్యాంకుల వద్ద రావాల్సిన నగదు నిల్వలు రావడం లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. చాలా మంది ఇలా అనధికారికంగా లెక్కల్లో చూపకుండా జరుగుతున్న లావాదేవీలల వల్ల కొంత మంది నగదు నిల్వలను బ్యాంకులో డిపాజిట్లు చేయకుండా బ్యాంకు లాకర్లలో కూడా దాచుకుంటున్నారని, ఇది నగదు చెలామణిలోకి రాకుండా ఉండటానికి ఒక కారణం అవుతుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నది.

కేంద్ర ప్రభుత్వం నగదు చెలామణిని తగ్గించడం ద్వారా బ్లాక్ మార్కెట్‌ను అరికట్ట వచ్చునని చెపుతూ యూపీఐ పేమెంట్లను ప్రోత్సహించింది. దీంతో చిరు వ్యాపారుల వద్ద నగదు లేకుండా పోయింది. ఎవరైనా డబ్బులు ఇచ్చి చిల్లర ఇవ్వమంటే స్కాన్ చేయండి అని చెపుతున్నారు. ఇలా చిల్లర వ్యాపారులే కాదు… సూపర్ మార్కెట్లు, వివిధ షాపుల వద్ద ఎక్కడ అయినా సరే… చిల్లర ఇవ్వడానికి కౌంటర్లో క్యాష్ లేదు.. మీరు యుపీఐ పేమెంట్ చేయండని సమాధానం వస్తుంది.

బ్యాంకులలో తగిన నగదు నిల్వలు అందుబాటులో లేవు. అలాగే ఏటిఎంలలో క్యాష్ అందుబాటులో ఉండడం లేదు.. అలాగే ప్రజల వద్ద కూడా తగిన నగదు నిల్వలు లేక పోవడంతో డిజిటల్ పేమెంట్ లే ఎక్కువగా చేస్తున్నారు. అలాంటప్పుడు రిజర్వ్ బ్యాంకు దేశంలో ప్రజల కోసం అందుబాటులో ఉంచిన రూ. 38 లక్షల కోట్ల నగదుపైన సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. డిజిటల్ పేమెంట్లు పెరిగిన తరువాత కూడా నగదు అందుబాటులో లేక పోవడంపై సర్వత్రా విమర్శలు వెలువడుతున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: VIDHATHA