Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మమత స్వయంకృతాపరాధాలు.. బీజేపీకి కలిసొచ్చాయా? బీఆరెస్‌తో పోలికేంటి?

మమత స్వయంకృతాపరాధాలు.. బీజేపీకి కలిసొచ్చాయా? బీఆరెస్‌తో పోలికేంటి?

VIDHATHA 3 weeks ago

తాను తీసుకున్న గోతిలో తానే పడ్డట్టయిందని తృణమూల్‌ అధినేత మమతా బెనర్జీ వ్యవహారం. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా నిర్బంధ కాండ ప్రయోగించిన మమత.. ఆ శూన్యతను బీజేపీ భర్తీ చేస్తుందనే సోయి కూడా లేకుండా వ్యవహరించడం వల్లే బీజేపీకి ఇప్పుడు అధికారం దక్కిందని పరిశీలకులు అంటున్నారు.

రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే ఉంటాయన్న నానుడి ఉంది. సరిగ్గా మమతా బెనర్జీకి ఈ నానుడి సరిగ్గా సరిపోతుందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. బెంగాల్‌లో ఊసులో లేని బీజేపీ క్రమంగా చొచ్చుకువచ్చి.. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఎదగడం మమతా బెనర్జీ అనుసరించిన విధానాల వల్లేనని అంటున్నారు. నిజానికి ఇది మమతాబెనర్జీ స్వయంకృతాపరాధమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

కమ్యూనిస్టుల సుదీర్ఘ ఏకఛత్రాధిపత్యానికి గండికొట్టిన మమత పార్టీ.. తదుపరి వారిపై తీవ్రస్థాయిలో దౌర్జన్యాలకు, నిర్బంధాలకు పాల్పడిందనే ఆరోపణలు ఉన్నాయి. అది కూడా పదిహేనేళ్లపాటు ఆ నిర్బంధ కాండ కొనసాగుతూ వచ్చిందని, వాటిని తట్టుకోలేని లెఫ్ట్‌ ఓటర్లు విధిలేని పరిస్థితిలో బీజేపీకి క్రమంగా దగ్గరయ్యారని విశ్లేషకులు చెబుతున్నారు. కాంగ్రెస్‌ ప్రభావం చూపే పరిస్థితి లేకపోవడంతో ఓటర్లంతా బీజేపీకి మళ్లారు. ప్రతిపక్షంపై కనీవినీ ఎరుగని నిర్బంధాన్ని ప్రయోగించిన మమత.. తన గొయ్యిని తానే తవ్వుకుంటూ బీజేపీకి రాష్ట్రంలో అవకాశం ఇచ్చారు. ఇప్పుడు బీజేపీ వచ్చి దానిని పూర్తి చేసిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

కొంత తరచి చూస్తే తెలంగాణ అనుభవం కూడా ఇక్కడ పునరావృతం అయినట్టు కనిపిస్తున్నది. తెలంగాణ రాష్ట్రావిర్భావం తర్వాత కేసీఆర్‌ నాయకత్వంలో ఏర్పడిన బీఆరెస్‌ ప్రభుత్వం.. రాష్ట్రంలో ప్రతిపక్షం ఆనవాళ్లు లేకుండా చేసింది. రాజకీయ పునరేకీకరణ పేరుతో, నియోజకవర్గాల అభివృద్ధి పేరుతో కాంగ్రెస్‌ను, టీడీపీని ఖాళీ చేసింది. పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలను తన పార్టీలో కలిపేసుకుంది. దీంతో తెలంగాణలో రాజకీయ శూన్యత ఏర్పడింది. ఆ శూన్యతను బీజేపీ అందిపుచ్చుకుంది. అనేక మంది నేతలు బీజేపీకి మళ్లారు. ఒక విధంగా.. నిస్తేజంతో ఉన్న బీజేపీకి ఆయువు పోసింది బీఆరెస్. సరిగ్గా ఇదే పరిస్థితి బెంగాల్‌లోనూ కనిపిస్తున్నది. కాకపోతే అక్కడ ప్రజలపై తీవ్రస్థాయి నిర్బంధంతో ఓటింగ్‌ సరళి ఎకాఎకిన మారిపోయింది. ఆ నిర్బంధం.. ఆ భయం ఓటింగ్‌ రోజు వరకూ కొనసాగిందని కనిపిస్తున్నది. ఎగ్జిట్‌ పోల్స్‌ సంస్థ యాక్సిస్‌ మై ఇండియా అక్కడ సర్వే చేయడానికి వెళితే కనీస సంఖ్యలో కూడా ప్రజలు నోరు విప్పేందుకు భయపడ్డారు. దీంతో కనీస గణాంకాలు లేని కారణంగా తాము సర్వే వివరాలను వెల్లడించడం లేదని ఆ సంస్థ చెప్పిదంటే.. ఓటింగ్‌ రోజు వరకూ బెంగాల్‌ ప్రజల్లో ఎంతటి భయం ఉందో అర్థమవుతున్నది. బహుశా అందుకే మమత కంటే బీజేపీయే నయం అన్న భావనకు ఓటర్లు వచ్చి ఉంటారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: VIDHATHA