పశ్చిమాసియా యుద్ద సంక్షోభం నేర్పిన పాఠంతో ఎదురైన ఇంధన సమస్యలను భారత ప్రభుత్వం గుణ పాఠంగా తీసుకుంది. పశ్చిమాసియా యుద్దంతో దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని, చమురు, గ్యాస్ కొరతలను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో పడింది.
ఇతర దేశాల నుంచి ఇంధన కొనుగోలు అవకాశాలతో పాటు దేశీయంగా ఇంధన అన్వేషణ, ఉత్పత్తి మార్గాలపై ఫోకస్ పెట్టింది.
విధాత : పశ్చిమాసియా యుద్ద సంక్షోభం నేర్పిన పాఠంతో ఎదురైన ఇంధన సమస్యలను భారత ప్రభుత్వం గుణ పాఠంగా తీసుకుంది. హార్మూజ్ జలసంధి మార్గంలో యుద్ద ఆంక్షలతో ప్రపంచ దేశాలతో పాటు భారత్ ఎదుర్కొంటున్న చమురు, గ్యాస్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం తంటాలు పడుతుంది. పశ్చిమాసియా యుద్దంతో దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని, చమురు, గ్యాస్ కొరతలను అధిగమించేందుకు కేంద్రం ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో పడింది. ఇతర దేశాల నుంచి ఇంధన కొనుగోలు అవకాశాలతో పాటు దేశీయంగా ఇంధన ఉత్పత్తి మార్గాలపై ఫోకస్ పెట్టింది.
ఓ వైపు హర్మూజ్ మార్గానికి ప్రత్యామ్నాయంగా గ్యాస్ సరఫరా కోసం ఒమన్ నుంచి గుజరాత్ వరకు సముద్ర గర్బంలో రూ.40వేల కోట్లతో పైప్ లైన్ నిర్మాణానికి కేంద్రం నిర్ణయించింది. బొగ్గుతో పర్యావరణ హిత గ్యాస్ ఉత్పత్తికి రూ. 37,500 కోట్లతో 'కోల్ లిగ్నైట్ గ్యాసిఫికేషన్' ప్రాజెక్టును కేంద్రం ప్రారంభించింది. యూఏఈతో ఆ దేశం మన దేశంలో 30 మిలియన్ బారెల్స్ ముడి చమురును నిల్వ చేయడానికి కొత్తగా ఒప్పందం కుదుర్చుకుంది. ఇటు దేశీయంగా చుట్టు ఉన్న సముద్ర గర్భాలలో చమురు, సహజ వాయువుల నిక్షేపాల అన్వేషణకు తెరలేపింది.
తూర్పు తీరంలో ఇంధన వనరుల అన్వేషణకు బిడ్లు
తూర్పు తీరంలో కొన్ని వేల కిలోమీటర్ల లైన్ల మేరకు చమురు, గ్యాస్ నిక్షేపాల అన్వేషణకు కేంద్రం నిర్ణయించింది. అధునాతన సాంకేతిక పరిజ్ణానంతో సముద్ర గర్భాలను జల్లెడ పట్టాలని నిర్ణయించింది.డైరక్టర్ జనరల్ ఆఫ్ హైడ్రో కార్భన్(డీజీహెచ్) విభాగం ఓ కొత్త ప్రాజెక్టును సిద్దం చేసింది. ఈ నెల 14న బిడ్ లను ఆహ్వానించింది. 2డీ బ్రాడ్ బ్యాండ్ మెరైన్ సీస్మిక్ ఆండ్ గ్రావిటీ మ్యాగ్నెటిక్ డేటా అక్విజిషన్ గా పిలిచే ఈ ప్రాజెక్టులో భాగంగా బెంగాల్ - పూర్ణియా, మహానది పరిధిలో 45వేల లైన్ కిలోమీటర్లు, అండమాన్ బేసిన్ లో 43వేల లైన్ కిలోమీటర్లు, కృష్ణా గోదావరి బేసిన్ లో43వేల లైన్ కిలోమీటర్లు, కావేరి బేసిన్ లో 30వేల లైన్ కిలోమీటర్ల పరిధిలో అండర్ వాటర్ స్కానింగ్ జరుగునుంది. రెండేళ్ల పాటు ఆయా ప్రాంతాల్లో చమురు, సహజ వాయువుల నిక్షేపాల కోసం అన్వేషణ కొనసాగనుంది.
దిగుమతుల సమస్యలకు పరిష్కారం
ప్రస్తుతం దేశీయ చమురు అవసరాల్లో 85శాతం మేరకు దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తుంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, అంతర్జాతీయ పరిణామాల కారణంగా ధరలు పెరిగిన దేశంలోని సామాన్యలపైన, ఆర్థిక వ్యవస్థపైన వాటి ప్రభావం పడుతుంది. చమురు, గ్యాస్ దిగుమతుల కోసం భారీగా విదేశీ మారక ద్రవ్యం ఖర్చు చేయాల్సి వస్తుండటం, రూపాయి బలహీన పడటం వంటి సమస్యలు దేశాన్ని ఆర్థికంగా దిగజారుస్తున్నాయి. ఈ క్రమంలో దేశ ఇంధన భవిష్యత్తును మలుపు తిప్పేలా భారీ చమురు, సహజవాయువుల నిక్షేపాల వేటకు కేంద్రం నిర్ణయించడం ఆసక్తికరం.
అన్వేషణ ఫలిస్తే..ఇంధన సుస్థిరతలో మైలురాయి
ఇప్పటివరకు ముంబై వంటి హైవే వంటి పశ్చిమ తీరంతో పోలిస్తే తూర్పు తీరంలో ఇంధన వనరుల అన్వేషణ పరిమితంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో మయన్మార్, ఇండోనేషియా గ్యాస్ క్షేత్రాలకు సమాంతరంగా ఉండే అండమాన్ బేసిన్ లో భారీగా గ్యాస్ నిక్షేపాలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రపంచం ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో కేంద్రం తీసుకున్న ఇంధన వనరుల అన్వేషణ ఫలిస్తే దేశ ఇంధన భద్రతను సుస్థిరలో మైలురాయిగా నిలవవచ్చంటున్నారు నిపుణులు.
ముడి చమురు నిల్వలకు యూఏఈతో కీలక ఒప్పందం.. యుద్దం వచ్చినా భారత్‌కు నో టెన్షన్!
ప్రధాని మోదీ యూఏఈ పర్యటన సందర్భంగా కుదిరిన ఒప్పందం భారత్ ఇంధన సమస్యల పరిష్కారానికి భరోసా ఇవ్వబోతుండటం ఆసక్తికరం. అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీ (ADNOC) భారతదేశానికి చెందిన 'స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్' (వ్యూహాత్మక చమురు నిల్వలు) లో దాదాపు 30 మిలియన్ బారెల్స్ ముడి చమురును నిల్వ చేయడానికి సిద్ధమైంది. మన గడ్డపైనే 30 మిలియన్ బారెల్స్ ఆయిల్ యూఏఈ దాచబోతుంది. అత్యవస సమయాల్లో ఈ నిల్వలను వాడే హక్కు మనకే ఉండనుంది.
చమురు నిల్వ చేయడానికి అయ్యే మొత్తం ఖర్చును కూడా యూఏఈ భరిస్తుంది. చమురుపై హక్కులు వారివే అయినప్పటికీ.. ఏదైనా అత్యవసర పరిస్థితి (Emergency) వస్తే మాత్రం మొదట ఆ చమురును వాడుకునే అవకాశం భారత్‌కే ఉంటుంది. భారతీయ పన్ను చెల్లింపుదారులపై ఒక్క రూపాయి కూడా భారం పడదు. మౌలిక వసతుల ఖర్చు కూడా లేదు. అంతర్జాతీయంగా చమురు సరఫరా ఆగిపోయినా, మనకు తక్షణ ఇంధన భద్రత లభిస్తుంది. దీనితో పాటు వ్యూహాత్మక గ్యాస్ నిల్వలు, దీర్ఘకాలిక ఎల్‌పీజీ (LPG) సరఫరాలపై కూడా కీలక అడుగులు పడ్డాయి.
ఈ ఒప్పందం భారత్‌కు ఎందుకు అంత కీలకం?
1. 30 మిలియన్ బారెల్స్ చమురు అంటే భారతదేశం యొక్క 5-6 రోజుల మొత్తం వినియోగంతో సమానం. యుద్ధం, హార్ముజ్ జలసంధి దిగ్బంధనం లేదా ఓపెక్ (OPEC) సంక్షోభం లాంటి అత్యవసర సమయాల్లో భారత్ ట్యాంకర్ల కోసం వెతకాల్సిన పనిలేదు. మన సొంత గడ్డపై సిద్ధంగా ఉన్న నిల్వలను నేరుగా వాడుకోవచ్చు.
2. గల్ఫ్ దేశాల నుండి చమురు ఎగుమతి చేసే మార్గాల్లో దశాబ్దాలుగా ఉన్న భద్రతా నష్టాలను అబుదాబీ దీని ద్వారా అధిగమిస్తుంది. ఆ చమురును భద్రంగా దాచినందుకు భారత్‌కు ప్రయోజనం దక్కుతుంది.
3. ప్రపంచమంతా మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలను చూసి ఆందోళన చెందుతుంటే, భారత్ మాత్రం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా తన ఇంధన భద్రతను మరియు ఆదాయాన్ని సుస్థిరం చేసుకోవడంతో ముందడుగు వేసినట్లయ్యింది.
వ్యూహాత్మకంగా రెండు దేశాలు మధ్య కుదిరిన ఈ ఒప్పందంతో యూఏఈ తన రిస్క్‌ను తగ్గించుకుంటే, భారత్ వేరొకరి ఖర్చుతో తన ఇంధన నిల్వలను పెంచుకోవడం విశేషం.

