Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'పెద్ది'కి 'దంగల్‌', 'సుల్తాన్‌'లే స్ఫూర్తి : ఆమిర్‌, సల్మాన్‌లకు రామ్‌చరణ్‌ ధన్యవాదాలు..

'పెద్ది'కి 'దంగల్‌', 'సుల్తాన్‌'లే స్ఫూర్తి : ఆమిర్‌, సల్మాన్‌లకు రామ్‌చరణ్‌ ధన్యవాదాలు..

VIDHATHA 6 days ago

'పెద్ది' ట్రైలర్‌ విడుదల సందర్భంగా రామ్​ చరణ్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్పోర్ట్స్‌ డ్రామాలకు సల్మాన్‌ ఖాన్‌ 'సుల్తాన్‌', ఆమిర్‌ ఖాన్‌ 'దంగల్‌' బాట వేసాయంటూ, ఆమిర్​ఖాన్​, సల్మాన్​ ఖాన్​లకు ధన్యవాదాలు చెప్పడం ఆహుతుల మనసులకు హత్తుకుంది.

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం రెండేళ్లు జీవించానని, రెజ్లింగ్‌ సీన్లలో గాయం అయినా అది అందమైన జ్ఞాపకమేనని చరణ్‌ చెప్పడం అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచింది.

Ram Charan Thanks Salman Khan, Aamir Khan For Inspiring Peddi

విధాత వినోదం డెస్క్‌ | మే 18, 2026:
ముంబయి: మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ నటిస్తున్న భారీ పాన్‌ ఇండియా చిత్రం 'పెద్ది' విడుదలకు ముందే అంచనాలను ఆకాశంలోకి చేర్చింది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పోర్ట్స్‌ యాక్షన్‌ డ్రామా ట్రైలర్‌ నేడు ముంబైలో విడుదల కాగా, ఈ సందర్భంగా రామ్‌చరణ్‌ చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో ఆసక్తిగా మారాయి. స్పోర్ట్స్‌ డ్రామా జోనర్‌లో ఇలాంటి కథలు చెప్పే దారి చూపింది ముందుగా సల్మాన్‌ ఖాన్‌, ఆమిర్‌ ఖాన్‌లేనని చరణ్‌ అన్నారు. 'సుల్తాన్‌', 'దంగల్‌'లాంటి సినిమాలు తమకు ధైర్యం ఇచ్చాయని ఆయన పేర్కొన్నారు. 'పెద్ది'సినిమా జూన్‌ 4, 2026న థియేటర్లలో విడుదల కానుంది.

ట్రైలర్‌ లాంచ్‌ వేదికపై మాట్లాడిన రామ్‌ చరణ్‌.. ముందుగా సల్మాన్‌ ఖాన్‌, ఆమిర్‌ ఖాన్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. క్రీడా నేపథ్య కథల్లో నటించడానికి, శారీరకంగా అలాంటి కష్టమైన పాత్రలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి 'సుల్తాన్‌', 'దంగల్‌'లాంటి సినిమాలు తోవ చూపించాయని అన్నారు. ఆ సినిమాలు ఇచ్చిన ధైర్యమే 'పెద్ది'లాంటి కథను మరింత బలంగా తీర్చిదిద్దేందుకు స్ఫూర్తిగా నిలిచిందని చరణ్‌ వ్యాఖ్యానించారు.

రామ్‌ చరణ్‌ మాటల్లో 'పెద్ది' కేవలం స్పోర్ట్స్‌ సినిమా మాత్రమే కాదు. ఒక పల్లెటూరి మనిషి ఆత్మగౌరవం, తన ఊరి ప్రతిష్ట, సమాజాన్ని ఏకం చేయాలనే తపన చుట్టూ తిరిగే కథగా ఇది కనిపిస్తోంది. ట్రైలర్‌లో కనిపించిన పల్లె వాతావరణం, పోరాటాలు, భావోద్వేగ సంఘర్షణలు ఈ సినిమాను రెగ్యులర్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా కాకుండా ఒక ఎమోషనల్‌ డ్రామాగా నిలబెట్టే సూచనలు ఇస్తున్నాయి.

ఈ సినిమా కోసం తాను రెండేళ్లుగా పనిచేస్తున్నానని,కానీ దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ కథతో దాదాపు ఐదేళ్లుగా ప్రయాణిస్తున్నారని రామ్‌ చరణ్‌ పేర్కొన్నారు. దర్శకుడి పట్టుదల, కథపై ఉన్న నమ్మకం, పాత్రలపై ఉన్న స్పష్టత వల్లే 'పెద్ది'కి ఇంత భారీ స్థాయి వచ్చిందని చరణ్‌ ఉద్వేగంగా చెప్పారు.

'పెద్ది' ట్రైలర్‌ లాంచ్‌లో సినిమా ప్రయాణం, స్పోర్ట్స్‌ డ్రామా నేపథ్యం, షూటింగ్‌ అనుభవాలపై రామ్​ చరణ్​ ఆసక్తికర వ్యాఖ్యలు

'పెద్ది' కోసం శారీరకంగా పడ్డ కష్టం గురించి మాట్లాడిన రామ్‌చరణ్‌.. షూటింగ్‌లో తగిలిన గాయాన్ని కూడా నవ్వుతూ గుర్తు చేసుకున్నారు. రెజ్లింగ్‌ సీన్ల కోసం ట్రెయిన్డ్‌ ఆర్టిస్టుల బదులు నిజమైన రెజ్లర్లను తీసుకొచ్చారని, అందుకే తన చేతికి లిగమెంట్‌ టియర్‌ అయిందని సరదాగా దర్శకుడు బుచ్చిబాబుపై నెపం మోపారు. అయితే ఆ గాయం కూడా ఇప్పుడు ఈ సినిమా ప్రయాణంలో ఒక అందమైన జ్ఞాపకంగా మిగిలిందని చరణ్‌ అన్నారు.

సినిమాలో రామ్‌ చరణ్‌కు జోడీగా జాన్వీ కపూర్‌ నటిస్తోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఏ.ఆర్‌. రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. ట్రైలర్‌ లాంచ్‌లో జాన్వీ కపూర్‌ కూడా పాల్గొని, దర్శకుడు బుచ్చిబాబు అమాయకంగా కనిపించినా చాలా రౌడీ డైరెక్టర్‌ అని సరదాగా అంది.

గ్రామీణ నేపథ్యం, ఆట చుట్టూ తిరిగే కథ, పల్లె గౌరవం కోసం పోరాడే హీరో, భావోద్వేగాలతో కూడిన దృశ్యాలు- ఇవన్నీ కలిపి 'పెద్ది'పై అంచనాలను మరింత పెంచుతున్నాయి. 'ఆర్‌ఆర్‌ఆర్‌' తర్వాత రామ్‌ చరణ్‌ నుంచి వచ్చే భారీ స్థాయి పాత్రల్లో ఇది ఒకటిగా కనిపిస్తోంది. ముఖ్యంగా స్పోర్ట్స్‌ డ్రామా, మాస్‌ యాక్షన్‌, పల్లె అనుబంధాల మేళవింపుతో ఈ చిత్రం పాన్‌ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా అన్న ఆసక్తి ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ నెలకొంది.

'సుల్తాన్‌', 'దంగల్‌' సినిమాలు చూపిన దారి 'పెద్ది'కి ధైర్యం ఇచ్చిందని రామ్‌చరణ్‌ చెప్పడం ఈ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ఆటను కేవలం పోటీగా కాకుండా గౌరవం, గుర్తింపు, సమాజ ఐక్యతకు ప్రతీకగా చూపించే కథగా 'పెద్ది' నిలుస్తుందా అన్నది జూన్‌ 4న తేలనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: VIDHATHA