Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వైరల్..వృద్ధ దంపతులపై అమానవీయ చర్య

వైరల్..వృద్ధ దంపతులపై అమానవీయ చర్య

VIDHATHA 1 week ago

భోగాపురం ఎయిర్‌పోర్ట్ భూసేకరణలో పరిహారం కోరిన వృద్ధ దంపతులను ప్రొక్లెయినర్ బకెట్‌లో ఎత్తిపడేయడం వైరల్‌గా మారి అధికారుల తీరుపై తీవ్ర విమర్శలకు దారితీసింది.

భూసేకరణను అడ్డుకున్న వృద్ధ దంపతులని ప్రొక్లెయినర్ బకెట్‌లో కూర్చోబెట్టి భయభ్రాంతులకు గురిచేసిన అమానవీయ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏపీలోని విజయనగరం జిల్లాలో భోగాపురం మండలం బైరెడ్డిపాలెంలో ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది.

భోగాపురం ఎయిర్‌పోర్ట్ అప్రోచ్ రోడ్డు కోసం సేకరించిన భూముల స్వాధీనానికి రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. అయితే తమకు పరిహారం చెల్లించకుండా భూముల స్వాధీనం చేసుకోరాదంటూ బాధిత రైతులు అడ్డుకున్నారు. ప్రొక్లెయినర్లు, జేసీబీలకు అడ్డుపడ్డారు. ప్రభుత్వం ప్రకటించిన పరిహారం మార్కెట్ విలువకు సరిపోవడం లేదని, తమకు న్యాయమైన పరిహారం అందడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. రైతుల ఆందోళనల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం భారీగా పోలీసులను మోహరించి బలవంతంగా భూములు, ఇళ్లను స్వాధీనం చేసుకునే చర్యలు చేపట్టింది. భూసేకరణ, ఇళ్ల కూల్చివేతలను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది.

ఈ క్రమంలో ప్రొక్లెయినర్(హిటాచీ) డ్రైవర్ పనులకు అడ్డుపడిన వృద్ద దంపతులను ప్రొక్లెయినర్ బకెట్ లో ఉండగానే గాలిలో పైకి లేపి పక్కకు తరలించాడు. తమకి చెందిన 40సెంట్ల భూమికి పరిహారం అందలేదని వృద్ద దంపతులు ఆరోపించారు. వారికి నచ్చచెప్పి, న్యాయం చేయకుండా అమానుషంగా ప్రొక్లెయినర్ బకెట్ తో పక్కకు ఎత్తిపడేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కాగా..అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు రేగుతున్నాయి. భూసేకరణలో రైతుల హక్కుల రక్షణకు ఎన్ని చట్టాలు ఉన్నా…ఆచరణలో మాత్రం ప్రభుత్వాలు, అధికారులు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: VIDHATHA