Thursday, 26 Nov, 11.38 am VIGIL MEDIA

పాలిటిక్స్‌
జగనన్న తోడు.. పేదలకు రూ.10 వేలు.. ఇలా పొందాలి

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్ని వర్గాలను ఆకట్టుకునేలా పథకాలను ప్రవేశపెడుతున్న ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్మోహన్ రెడ్డి మరో పథకానికి శ్రీకారం చుట్టారు. చిరు వ్యాపారులకు ఆర్థిక చేయూత ఇవ్వడమే లక్ష్యంగా ప్రభుత్వం జగనన్న తోడు పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో సుమారు లక్ష మంది చిరు వ్యాపారులకు ఒక్కొక్కరికి పది వేల చొప్పున రూ.1,000 కోట్ల వడ్డీ లేని రుణాన్ని అందించడమే ఈ పథకం లక్ష్యం.

చిరు వ్యాపారులు నిత్యం వడ్డీ వ్యాపారుల వేధింపులకు గురవుతుంటారు. డైలీ ఫైనాన్స్, అధిక వడ్డీలకు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు తీసుకొని వడ్డీలు కట్టలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటారు. ఈ నేపథ్యంలో చిరు వ్యాపారులను కొంతైనా ఆదుకునేందుకు గానూ ప్రభుత్వం వడ్డీ లేకుండా రూ.10 వేల రుణాన్ని అందించాలని నిర్ణయించింది. నవంబర్ 25న ముఖ్యమంత్రి జగన్ ఈ పథకాన్ని ప్రారంభించారు.

అర్హులు వీరే.
గ్రామాల్లో, పట్టణాల్లో సుమారు 5 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు లేదా అంతకంటే తక్కువ స్థలంలో శాశ్వత లేక తాత్కాలిక షాపులు, తోపుడు బండ్లు ఏర్పాటు చేసుకొని వ్యాపారం చేసుకునే పేద వారు అందరూ జగనన్న తోడు పథకం పొందేందుకు అర్హులు. చిరు వ్యాపారులే కాకుండా సాంప్రదాయ చేతివృత్తుల వారు కూడా ఈ పథకం పొందేందుకు అర్హులే. తల మీద గంపలో వస్తువులు మోస్తూ అమ్ముకునే వారు, సైకిల్‌, మోటార్ సైకిల్‌, ఆటోలపై వెళ్లి వ్యాపారం చేసుకునే వారు కూడా ఈ పథకం పొందేందుకు అర్హులు.

లబ్ధిదారుల ఎంపిక ఇలా..
గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా గ్రామ సచివాలయాల్లోనే జగనన్న తోడు పథకం లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. ఈ పథకం పొందేందుకు గ్రామ, వార్డు వాలంటీర్లను సంప్రదించాలి. అర్హుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏర్పాటు రేసి సామాజిక తనిఖీ చేసి పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. అర్హతలు ఉండి కూడా జాబితాలో పేరు లేకపోతే గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే పథకంలో చేరుస్తారు.

రుణం అందించే విధానం
అర్హులకు ప్రభుత్వమే బ్యాంకుల నుంచి రూ.10 వేల చొప్పు ఒక్కొక్కరికి రుణం ఇప్పిస్తుంది. బ్యాంకుల్లో ఖాతా తెరవడం నుంచి రుణాలు ఇప్పించే వరకు లబ్ధిదారులకు గ్రామ, వార్డు వాలంటీర్లు సహకరిస్తారు. ఇందుకు గానూ చిరు వ్యాపారులందరికీ స్మార్ట్ కార్డులను ప్రభుత్వం జారీ చేస్తోంది. బ్యాంకుల నుంచి చిరువ్యాపారులు తీసుకునే రుణానికి సంబంధించిన వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుంది. జగనన్న తోడు పథకానికి సంబంధించి అర్హత ఉండి జాబితాలో పేరు లేని వారు సహాయం, ఫిర్యాదుల కోసం 1902 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయవచ్చు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Vigil Media Telugu
Top