Posts
హిందీ, ఇంగ్లీషు కలిపి మాట్లాడినా స్పందిస్తుంది
నేచురల్ వాయిస్ సాంకేతికతతో ఆల్ట్రోజ్ కారులో కొత్త రకం
ప్రస్తుత మోడళ్ల కంటే ధర రూ.60,000 ఎక

ఓ కారులో మనం ఏం చెబితే అలా చేసే (కమాండ్స్) ప్రత్యేకత ఉందనుకుందాం. ‘ఇండికేటర్ ఆన్’ అని చెబితే చేసేస్తుంది.. ‘దర్వాజా బంద్ కరో’ అని అంటే కూడా చేసేస్తుంది. మరి డోర్ బంద్ కరో అనగానే.. ఎలాంటి స్పందన ఉండకపోవచ్చు. కారణం.. ఇందులో సగం హిందీ, సగం ఇంగ్లిషు పదాలు (హింగ్లిషు). పూర్తిగా ఏదోక భాషలో చెబితేనే దానికి అర్థమై తదనుగుణంగా స్పందిస్తుంది. అయితే ఇప్పుడు ఎవరు ఏం మాట్లాడినా అందులో ఇంగ్లీషు పదాలు రావడం సర్వసాధారణం అయిపోయింది. హిందీ మాట్లాడేవాళ్లూ ఇందుకు మినహాయింపు కాదు. అందుకే హిందీ, ఇంగ్లిషు పదాలు కలిపి మాట్లాడినా అర్థం చేసుకునే ప్రత్యేకతతో తన ఖరీదైన హ్యాచ్‌బ్యాక్ కారు ఆల్ట్రోజ్‌లో ఐ-టర్బో పెట్రోలు రకాన్ని (వేరియంట్) టాటా మోటార్స్ తీసుకొచ్చింది.
ఆల్ట్రోజ్ రెవోట్రాన్ పెట్రోలు రకాల కార్ల ధరలతో పోలిస్తే ఈ కొత్త రకం కారు ధర రూ.60,000 ఎక్కువ. ప్రస్తుతం రెవోట్రాన్ పెట్రోలు వేరియంట్ల ధర రూ.5.7 లక్షల నుంచి రూ.8.86 లక్షల (దిల్లీ, ఎక్స్‌షోరూం) మధ్య ఉంది. 1.2 లీటర్ టర్బోఛార్జ్డ్ బీఎస్-6 పెట్రోలు ఇంజిన్, 27 కనెక్టెడ్ కార్ ప్రత్యేకతలతో కూడిన ఐఆర్ఏ- కనెక్టెడ్ కార్ సాంకేతికతతో ఆల్ట్రోజ్ ఐటర్బో వేరియంట్ లభ్యం కానుంది. ఇందులో ఉన్న నేచురల్ వాయిస్ సాంకేతికత ద్వారా ఇంగ్లిషులేదా హిందీలోనే కాకుండా హింగ్లిషులో చెప్పినా అర్థం చేసుకుని తదనుగుణంగా స్పందిస్తుందని టాటా మోటార్స్ వెల్లడించింది.
అలాగే ఆల్ట్రోజ్ శ్రేణిలోనే డీజిల్, పెట్రోల్ ఇంజిన్లతో ఎక్స్జెడ్ ప్లస్ వేరియంట్‌ను కూడా కంపెనీ తీసుకొచ్చింది. పెట్రోలు వేరియంట్ ధర రూ.8.26 లక్షలు కాగా.. డీజిల్ రకం ధర రూ.9.46 లక్షలు (ఎక్స్‌షోరూం, దిల్లీ). 2020 జనవరిలో ఆల్ట్రోజ్ మోడల్‌ను విడుదల చేసినప్పటి నుంచి ఖరీదైన హ్యాచ్‌బ్యాక్ కార్ల విభాగంలో తమ వాటా గణనీయంగా పెరిగిందని టాటా మోటార్స్ ప్రెసిడెంట్ (ప్యాసింజర్ వాహనాల వ్యాపార విభాగం) శైలేష్ చంద్ర అన్నారు.
ఏడాదికాలంలో ఈ మోడల్ కార్లను 50,000కి పైగా కంపెనీ విక్రయించింది.