Posts
వూహాన్లో కోవిడ్-19 విజృంభణకు ఏడాది: కరోనావైరస్పై చైనా విజయం సాధించిందా? లేక నిజాలను దాచిపెడుతోందా?

చైనా నగరం వూహాన్లో కరోనావైరస్ మహమ్మారి చెలరేగి ఏడాది పూర్తైంది. ఇక్కడ కోవిడ్-19ను విపత్తులా కాకుండా విపత్తుపై విజయంలా ప్రజలు గుర్తుపెట్టుకుంటున్నారు. అంతేకాదు వేరేచోట నుంచే ఇక్కడకు వైరస్ వచ్చిందని చెబుతున్నారు.
కొత్త కరోనావైరస్లపై పరిశోధన చేస్తున్న వూహాన్‌లోని ఓ ల్యాబొరేటరీ నుంచి ఈ వైరస్ పుట్టిందని మొదట్లో వార్తలు వచ్చాయి. గబ్బిలాల్లోని కరోనావైరస్పై పరిశోధన చేపడుతున్న అధ్యయనకర్తల బృందానికి నేతృత్వం వహిస్తున్న వూహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) పరిశోధకురాలు షీ ఝెన్‌గ్లీ ఈ వివాదానికి కేంద్ర బిందువయ్యారు.
డబ్ల్యూఐవీ ప్రయోగశాల నుంచి ప్రమాదవశాత్తు ఈ వైరస్ బయటకు వచ్చిందన్న వాదనను ఆమె ఏడాది కాలంగా ఖండిస్తూ వస్తున్నారు.
వూహాన్లో కరోనావైరస్ వ్యాప్తి ఎలా మొదలై ఉండొచ్చనే వాదనపై ఆమె ఇటీవల తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
సైన్స్ మ్యాగజైన్ తాజా ఎడిషన్‌కు ఆమె ఒక ఆర్టికల్ రాశారు. వుహాన్‌లో వైరస్ విజృంభణ మొదలుకాకముందే, డిసెంబరు 2019కు ముందే, చైనాకు వెలుపల ఈ వైరస్ జాడలు కనిపించాయని చెబుతున్న అధ్యయనాలను ఆమె దీనిలో ఉటంకించారు.
‘‘దిగుమతి చేసుకున్న ఫుడ్ ప్యాకేజీలు, సరిగా వండని ఆహార పదార్థాలు సార్స్సీఓవీ-2 వైరస్ విజృంభణకు కారణం కావొచ్చు’’అని కథనంలో ఆమె రాసుకొచ్చారు.
ప్రపంచ ప్రముఖ కరోనావైరస్ పరిశోధకుల్లో ఒకరైన నిపుణులు కోవిడ్-19 ఉనికిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొంచెం అసాధారణంగానే అనిపిస్తుంది.
వూహాన్ ఆరోగ్య వ్యవస్థను దాదాపుగా అస్తవ్యస్తంచేసిన, ప్రపంచ వ్యాప్తంగా విధ్వంసం సృష్టించిన కోవిడ్-19 వైరస్.. దిగుమతి చేసుకున్న ఆహారం నుంచి ఇక్కడకు వచ్చిందా? మిగతా చోట్ల ఎలాంటి విధ్వంసకర ఆనవాళ్లు బయటపడకుండా వుహాన్‌లోనే ఇలా జరగడం సాధ్యమేనా?
అయితే, ఇక్కడ వైరస్‌కు కళ్లెం వేసిన తర్వాత, దాదాపు అందరూ ఇదే విషయాన్ని ముక్తం కంఠంతో చెబుతున్నారు.
‘‘వేరే దేశాల నుంచే ఇక్కడకు వైరస్ వచ్చింది. చైనా దీనికి బాధిత దేశం మాత్రమే’’అని వూహాన్ నగరంలో ఓ రెస్టారెంట్‌ను నడుపుతున్న ఒక మహిళ చెప్పారు.
‘‘మరి ఎక్కడి నుంచి ఈ వైరస్ వచ్చింది’’అని నేను ప్రశ్నించినప్పుడు పక్కనే ఉన్న ఓ చేపలు అమ్ముకునే మహిళ స్పందించారు. ‘‘అది అమెరికా నుంచే ఇక్కడకు వచ్చింది’’అని సమాధానం ఇచ్చారు.