Baby
తమిళనాడు రాష్ట్రంలోని తిరునెల్వేలి జిల్లాలో ఒక షాకింగ్ ఘటన వెలుగు చూసింది. వివాహమైన మరుసటి రోజే నవవధువు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని పాలయంకోట్ట సమీపంలోని అరియకుళం లైన్ వీధికి చెందిన వెంకటేశ్ (25)కు తాళయాత్తు ప్రాంతానికి చెందిన పిచ్చమ్మాళ్‌తో ఈ నెల 15వ తేదీన వివాహం జరిగింది. పెళ్లి అనంతరం ఆమె అత్తవారింటికి చేరుకుంది. ఆ మరుసటి రోజు ఉదయం పిచ్చమ్మాళ్‌కు తీవ్రమైన కడుపునొప్పితో పాటు రక్తస్రావం కూడా అయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు.
అదేసమయంలో వెంకేటేశ్ నివాసంలో స్నానాలగదిలో మృతశిశువు ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఏడు నెలలకే జన్మించిన ఆడ శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తిరునెల్వేలి ఆస్పత్రికి తరలించారు. ఈ ఉదంతంపై వరుడు వెంకటేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పిచ్చమ్మాళ్ల ఏడు నెలల గర్భవతి అనే విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు దాచిపెట్టి, తనను మోసం చేసి పెళ్ళిచేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంకటేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు నవవధువు పచ్చిమ్మాళ్‌పై నమ్మకద్రోహం, గర్భస్రావానికి కారణమవ్వడం వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పిచ్చమ్మాళ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, ఆమె వద్ద పోలీసులు విచారణ జరుపుతున్నారు.

