స్వదేశంలో జరిగిన ఐపీఎల్ 2026 సీజనులో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ సృష్టించిన సంచలనాలు మామూలుగా లేవు. రాజస్థాన్ రాయల్స్ యువ కెరటంగా బరిలోకి దిగిన సూర్యవంశీ తన అసాధారణ బ్యాటింగ్‌తో సరికొత్త చరిత్ర లిఖించాడు.
శుక్రవారం గుజరాత్ టైటాన్స్ జరిగిన కీలకమైన క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 47 బంతుల్లో 8 ఫోర్లు, 7 భారీ సిక్సర్లతో 96 పరుగులు చేసి, త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. ఐపీఎల్ రికార్డు పుస్తకాల్లో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు.
ఈ ఒక్క ఇన్నింగ్స్ వైభవ్ సూర్యవంశీ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి అన్ క్యాప్డ్ ప్లేయర్. ఒకే ఐపీఎల్ సీజన్‌లో 700 పరుగుల మైలురాయిని దాటిన తొలి అన్ క్యాప్డ్(అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడని) ఆటగాడిగా వైభవ్ చరిత్ర సృష్టించాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 16 మ్యాచ్‌లలో 48.50 సగటుతో 776 పరుగులు సాధించాడు.
అలాగే, ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా (ఎదుర్కొన్న బంతుల పరంగా) 1000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్ అగ్రస్థానంలో నిలిచాడు. కేవలం 440 బంతుల్లోనే ఈ ఘనత సాధించి, వెస్టిండీస్ విధ్వంసకారుడు ఆండ్రీ రస్సెల్ (545 బంతులు) రికార్డును బద్దలు కొట్టాడు. ఐపీఎల్‌లో ఒక సీజన్‌లో 700 పరుగులు చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా (15 సంవత్సరాల 63 రోజులు) నిలిచాడు. గతంలో ఈ రికార్డు సాయి సుదర్శన్ పేరిట ఉండేది.

