ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటించడమేకాకుండా, దానికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్ ఆమోదముద్ర వేసింది. దీనిపై వైకాపా మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది.
దీనిపై విజయసాయి రెడ్డి మరోమారు ట్వీట్ చేశారు. 'నిన్నటి నా ట్వీట్‌లో అమరావతిని కమరావతి కానివ్వద్దు అన్న సూచనను చూసి గంగవెర్రుతెల్తిన వారంతా, కూటమి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలకు ఏమి బదులిస్తారు' అని ఆయన ప్రశ్నించారు. రాజధాని అమరావతిపై వైకాపాకు స్పష్టమైన, స్థిరమైన విధానం లేదని, అదేసమయంలో టీడీపీకి ఇసుమంతైనా చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు.
అంతటితో ఆగకుండా తన మాజీ పార్టీ వైకాపా ఎంపీల తీరును కూడా ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. సాక్షాత్తు మీ వైకాపా పార్టీ అధ్యక్షుడిపై రాజ్యసభలో ఒక కాంగ్రెస్ ఎంపీ అలా నోరు పారేసుకుంటుంటే వైకాపా ఎంపీలకు చీమ కుట్టినట్టైనా అనిపించలేదా అడ్డుకోరా? ఖండించరా? మౌన ప్రేక్షకులైనారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

