బీహారు రాష్ట్రంలో హాజీపూర్‌లో అమన్ కుమార్, గుంజన్ కుమారి నివాసం వుంటున్నారు. వీరికి పదేళ్ల కుమారుడు వున్నాడు. ఐతే భార్యకు ఎలాగైనా ఉద్యోగస్తురాల్ని చేయాలన్న పట్టుదలతో అమన్ కుమార్ తన వ్యవసాయ భూమిని అమ్మేసాడు. ఆ డబ్బుతో భార్య గుంజన్ కి బీపీఎస్సీ కోచింగ్ ఇప్పించాడు. ఆమెకి ఇంటి పనులేమీ చెప్పకుండా అన్నీ తనే చూసుకుంటూ ఆమె చదువుపై ధ్యాస పెట్టేందుకు సహకరించాడు. అనుకున్నట్లుగానే బీపీఎస్సీ పరీక్షలో గుంజన్ అర్హత సాధించింది. ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చాక ఆమె ప్రవర్తనలో కూడా క్రమేణా మార్పు వచ్చింది.
భర్తతో సమయం గడపడాన్ని తగ్గించేసింది. ఉద్యోగం వచ్చిన సందర్భంగా తన స్నేహితురాండ్లతో కలిసి పార్టీ చేసుకుంటున్నామనీ, అంతా కలిసి డార్జిలింగ్ వెళ్తున్నట్లు చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఐతే అలా వెళ్లిన గుంజన్ ఎంతకీ ఫోన్ చేయకపోగా, భర్త ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం మానేసింది. ఆ తర్వాత 10 రోజులకు గుంజన్ ఇంటికి తిరిగి వచ్చింది. ఎందుకలా చేసావ్, ఎక్కడికెళ్లావంటూ భర్త గట్టిగా నిలదీయడంతో అతడితో గొడవపడింది. విషయాన్ని తన మేనమామ దృష్టికి తీసుకుని వెళ్లాడు.
ఇంతలో గుంజన్ ఆమె ప్రియుడు ప్రేమ్ ప్రకాష్‌తో సన్నిహితంగా వుండటాన్ని గమనించి వారిని వెంబడించాడు. వారిద్దరూ ప్రియుడి ఇంట్లో ఏకాంతంగా గడపడాన్ని కళ్లారా చూసాడు. ఇదే విషయాన్ని మేనమామకి చెప్పగా... ఆమె నీతో వుండాలనుకోవడంలేదు. ఇప్పుడు ఏం చేద్దాం... వదిలేసెయ్ అంటూ చాలా తేలికగా సమాధానమిచ్చినట్లు ఆవేదన వ్యక్తం చేసాడు. ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుని, తన భార్యను ప్రయోజకరాలిని చేసినందుకు నాకు దక్కిన బహుమతి ఇదా అంటూ ఆవేదన వ్యక్తం చేసాడు. తన భార్య గుంజన్ తో తను ఇక కలిసి జీవించే ప్రసక్తే లేదనీ, తమకు విడాకులు మంజూరు చేయాలంటూ పిటీషన్ దాఖలు చేసాడు.

