అలాగే, శ్రీవారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తితిదే అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తోందన్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 15 నుంచి 23వ తేదీ వరకు.. అక్టోబరు 12 నుంచి 20వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు వివరించారు. సెప్టెంబరు 15న రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు.
'శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయించాం. దేశంలో ఎక్కడా లేని విధంగా తిరుమలలో సహజ మరణానికి రూ.2 లక్షల బీమా వర్తిస్తుంది. ఈ పథకం కోసం ఎల్ఐసీ సంస్థకు తితిదే నిధుల నుంచి రూ.2.12 కోట్లు చెల్లించేందుకు ఆమోదం తెలిపాం. ప్రమాదవశాత్తు మరణించిన ఉద్యోగుల కుటుంబీకులకు బీమాను రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
శ్రీవారి పోటులో లడ్డూల తయారీని మరింత వేగవంతం చేసేందుకు 400 మంది అదనపు ఔట్ సోర్సింగ్ వర్కర్ పోస్టుల కోసం ప్రభుత్వ అనుమతికి ప్రతిపాదనలు పంపుతున్నాం. తితిదేలోని వివిధ విభాగాల్లో పని చేస్తున్న 48 మంది ఉద్యోగుల వేతనాలను పెంచాలని నిర్ణయించాం. నారాయణవనం శ్రీపద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారి పద్మపీఠానికి బంగారు తాపడం ఏర్పాటుకు ఆమోదం తెలిపాం. చెన్నైలోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ధ్వజస్తంభం, బలిపీఠానికి బంగారు తాపడం కోసం రూ.17.05 కోట్లకు పాలకమండలి ఆమోదం తెలిపింది అని బీఆర్ నాయుడు వెల్లడించారు.

