Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
డిజిటల్ అరెస్టులతో భయపెట్టేవారి తాట తీయండి : సీఎం చంద్రబాబు ఆదేశం

డిజిటల్ అరెస్టులతో భయపెట్టేవారి తాట తీయండి : సీఎం చంద్రబాబు ఆదేశం

డిజిటల్ అరెస్టుల పేరుతో భయపెట్టేవారి తాట తీయాలని పోలీసు యంత్రాంగానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అమరావతిలోని సచివాలయంలో సైబర్ నేరాల కట్టడిపై జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
డిజిటల్ అరెస్ట్ పేరుతో ఫోన్లు చేసిన ప్రజలను భయపెడుతూ డబ్బులు దోచుకుంటున్న వారిని గుర్తించి తక్షణం అరెస్టు చేసేలా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

ఏళ్ల తరబడి కష్టపడి దాచుకున్న సొమ్మును సైబర్ నేరగాళ్లు దోచుకుంటుంటే కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, ఈ పరిస్థితిని అరికట్టాలని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని సైబర్ నేర రహితంగా మార్చడమే లక్ష్యమని, ఏపీ ప్రజలను మోసం చేస్తే తప్పించుకోలేమనే భయం నేరగాళ్లకు కలగాలని ఆయన హెచ్చరించారు.

రాష్ట్రంలో సైబర్ నేరాలను సమూలంగా నిర్మూలించేందుకు పోలీసు శాఖ 'ఏపీ సైబర్ గార్డ్' పేరుతో ఒక సమగ్ర వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. దీనికి సంబంధించిన కార్యాచరణను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ముఖ్యమంత్రికి వివరించారు. ఆరు స్తంభాల (6 పిల్లర్స్) ఆధారంగా ఈ వ్యవస్థ పనిచేస్తుందని తెలిపారు. ఇందులో భాగంగా సైబర్ వార్ రూం, 1930 కాల్ సెంటర్ దాష్ బోర్డ్, టెక్నాలజీ - ఏఐ వినియోగం, పోలీసులకు శిక్షణ, 3-టైర్ ఆర్కిటెక్చర్, ప్రజా చైతన్యం వంటివి ఉంటాయని పేర్కొన్నారు.

మంగళగిరిలోని 'ప్రభల టెక్ పార్క్'లో అత్యాధునిక సదుపాయాలతో రాష్ట్రస్థాయి సైబర్ వార్ రూం ఏర్పాటు చేస్తున్నామని, ఇది 30 రోజుల్లో అందుబాటులోకి వస్తుందని డీజీపీ తెలిపారు. సైబర్ మోసంపై ఫిర్యాదు అందిన వెంటనే 'జీరో ఎఫ్ఎస్ఐఆర్' నమోదు చేసి, గోల్డెన్ అవర్ టైంలో స్పందించి బాధితుల డబ్బు బదిలీ కాకుండా చూడాలని సీఎం సూచించారు. ఇందుకు బ్యాంకులు పూర్తి సహకారం అందించాలని కోరారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu