Dailyhunt
ఇష్టం లేకుండా ఒక బాలిక గర్భాన్ని కొనసాగించాలని బలవంతం చేయలేం... చట్టాలను మార్చండి : సుప్రీంకోర్టు

ఇష్టం లేకుండా ఒక బాలిక గర్భాన్ని కొనసాగించాలని బలవంతం చేయలేం... చట్టాలను మార్చండి : సుప్రీంకోర్టు

మైనర్ బాలిక గర్భవిచ్ఛిత్తి కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో 30 వారాల గర్భవిచ్ఛిత్తికి బాలికకు ఇటీవల అత్యున్నత న్యాయస్థానం అనుమతిచ్చింది.
అయితే దీనిపై ఎయిమ్స్‌ క్యూరేటివ్‌ పిటిషన్‌ వేసింది. ఈ దశలో గర్భాన్ని తొలిగిస్తే.. ఆ బాలిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో కేంద్రానికి సుప్రీం సూచనలు చేసింది.

ఇష్టం లేకుండా గర్భాన్ని కొనసాగించాలని ఒక మహిళ మరీ ముఖ్యంగా ఒక బాలికను బలవంతం చేయలేమని ఇటీవల ఈ కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది. అలాగే ఆ గర్భాన్ని తొలగించేందుకు అనుమతిచ్చింది. 'ఈ దశలో గర్భవిచ్ఛిత్తి చేస్తే ఆ మైనర్ తల్లి ఆరోగ్యంపై సుదీర్ఘ ప్రభావం ఉంటుంది' అని కోర్టులో ఎయిమ్స్ క్యూరేటివ్ పిటిషన్ వేసింది.

దీనిపై సుప్రీం ధర్మాసనం స్పందిస్తూ.. 'బాలికపై అత్యాచారం జరిగిన కేసు ఇది. ఆ ఘటన తాలూకు క్షోభ ఆమెకు జీవితాంతం ఉంటుంది. ఆమె ఎంత బాధపడి ఉంటుందో ఊహించుకోండి. ఆ బాలిక ఆరోగ్యంపై శాశ్వత ప్రభావం లేకపోతే దీనిని నిర్వహించాలి. ఈ ఆరోగ్య సమస్యల విషయంలో బాధితురాలి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వాలి. వారు తగిన నిర్ణయం తీసుకోవడంలో సహాయం చేయాలి. అందుకే నిర్ణయం బాధిత బాలిక, ఆమె తల్లిదండ్రులకే వదిలేస్తున్నాం' అని పేర్కొంది.

అత్యాచార కేసుల్లో బాధితులు గర్భం దాల్చితే ఏ సమయంలోనైనా దాన్ని తొలగించుకునేలా మార్పులు తీసుకురావాలని ఈ సందర్భంగా కేంద్రానికి సూచనలు చేసింది. 20 వారాలు దాటిన తర్వాత కూడా ఈ అవాంఛిత గర్భాన్ని తొలగించుకునేందుకు అత్యాచార బాధితులకు అనుమతించేలా చట్టాన్ని సవరించాలని సూచించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu