హైదరాబాద్ నగరానికి చెందిన 'ప్రజ్వల' అనే స్వచ్ఛంద సంస్థ 2004లో ఈ అంశంపై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. దేశంలో మహిళలు, చిన్నారుల అక్రమ రవాణా, లైంగిక దోపిడీ విపరీతంగా పెరిగిపోతోందని, బాధితుల రక్షణ, పునరావాస చర్యల్లో ప్రభుత్వాల మధ్య సమన్వయం కొరవడిందని ఆ పిటిషనులో పేర్కొంది. దాదాపు 22 ఏళ్లుగా కొనసాగిన ఈ విచారణలో షెల్టర్ హోమ్ దుస్థితి, బాధితులను మళ్లీ అదే రొంపిలోకి దింపడం, స్వచ్ఛంద సెక్స్ వర్కర్ల పట్ల పోలీసుల వైఖరి వంటి అనేక లోపాలను కోర్టు పరిశీలించింది. ఈ తీర్పు ద్వారా సుప్రీంకోర్టు బాధితుల హక్కులకు ప్రాధాన్యతనిస్తూ కీలకమైన మార్గదర్శకాలను నిర్దేశించింది.
సెక్స్ వర్క్, ట్రాఫికింగ్‌కు మధ్య తేడా : స్వచ్ఛందంగా, పెద్దవాళ్లు చేసే సెక్స్ వర్క్‌ను ట్రాఫికింగ్‌గా పరిగణించలేమని కోర్టు స్పష్టం చేసింది. బెదిరింపు, బలవంతం, మోసం లేదా దోపిడీ ఉన్నప్పుడే అది ట్రాఫికింగ్ కిందకు వస్తుందని తేల్చిచెప్పింది. ఇమ్మోరల్ ట్రాఫిక్ (ప్రివెన్షన్) యాక్ట్, 1956 కింద దాడులు చేసేటప్పుడు, బలవంతం జరిగిందనే ఆధారాలుంటేనే చర్యలు తీసుకోవాలని, అంతకుముందు ప్రాథమిక విచారణ తప్పనిసరి అని ఆదేశించింది.
పునరావాస ప్రమాణాలు : బాధితుల కోసం ఏర్పాటు చేసే షెల్టర్ హోమ్‌లలో కనీస వసతులు, మానసిక ఆరోగ్య మద్దతు, వృత్తి శిక్షణ, నష్టపరిహారం, న్యాయ సహాయం, సాక్షుల రక్షణ వంటి అంశాలపై స్పష్టమైన ప్రమాణాలను నిర్దేశించింది.
సంస్థల మధ్య సమన్వయం : యాంటీ-హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లు, న్యాయ సేవాధికార సంస్థలు, రాష్ట్రాల హోమ్స్ మధ్య సమన్వయాన్ని పెంచాలని, అంతర్రాష్ట్ర సహకారం మెరుగుపరచాలని ఆదేశించింది.
ఈ కేసులో దశాబ్దాలుగా పిటిషనర్ తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది అపర్ణా భట్‌ను ధర్మాసనం ప్రత్యేకంగా అభినందించింది. కొత్తగా ప్రత్యేక దర్యాప్తు సంస్థ అవసరం లేదని, ప్రస్తుత చట్టాలను పటిష్టంగా అమలు చేస్తే సరిపోతుందని కోర్టు అభిప్రాయపడింది. తాజా ఆదేశాల అమలుపై మూడు నెలల తర్వాత సమీక్షించనున్నట్లు తెలిపింది.

