ఒరిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్‌లో ఘోర ప్రమాదం నుంచి తండ్రి కుమార్తె తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. వారు ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్కు ఢీకొట్టింది.
ఆ తండ్రీకూతుళ్లు కారులో వంతెన దాటుతుండగా.. వెనుక నుంచి వచ్చిన ఒక భారీ ట్రక్కు దాన్ని బలంగా ఢీకొట్టింది. ఆ తర్వాత వాహనాన్ని ఆపలేదు సరికదా.. కారును రోడ్డుపై 600 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. దీంతో కారులో ఉన్నవారితో పాటు, రోడ్డుపై ఉన్న ప్రయాణికులు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
అదృష్టవశాత్తూ ఈ ప్రమాదం నుంచి తండ్రీకూతుళ్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు.

