ఇప్పటికే సియా, ఆమె ప్రియుడు చేతన్ వాంగ్మూలాలను నమోదు చేసుకొన్నట్లు పోలీసులు వెల్లడించారు. దర్యాప్తు ముందుకు వెళ్లాలంటే పాలిగ్రాఫ్ పరీక్ష అవసరమని వెల్లడించారు. దర్యాప్తునకు తాజా ఆధారాలను అందించేందుకు ఈ పరీక్షలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
ఏదైనా కేసులో ప్రాథమిక ఆధారాలు బలహీనంగా ఉన్న సమయంలో దర్యాప్తు బృందాలు పాలిగ్రాఫ్ పరీక్షలకు అనుమతి కోరతాయి. వాస్తవానికి వీటి ఫలితాలు కోర్టులో చెల్లవు. కేవలం దర్యాప్తు బృందాలకు సహకరించేందుకే కోర్టులు వీటికి అనుమతి ఇస్తాయి. ఈ కేసులో ఇప్పటికే సియా, చేతన్‌ను లోహగడ్ కోట వద్దకు తీసుకెళ్లి సీన్ రీక్రియేషన్ చేశారు. తాజాగా సహనిందితుడు చేతన్ నడకను విశ్లేషించేందుకు గెయిట్ అనాలసిస్ కూడా చేస్తున్నారు.
కేతన్‌ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకనే.. చేతన్‌తో కలిసి ఈ నేరానికి పాల్పడ్డానని సియా అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. ఆమె ఫోన్ ఎప్పుడూ బిజీ వచ్చేదని, చేతన్ పేరును తరచూ ప్రస్తావించేదని కేతన్ కుటుంబ సభ్యులు ఆరోపించిన సంగతి తెలిసిందే.
'వారి బంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతోనే మా కుమారుడిని హత్య చేశారు' అని ఈ నెల 23న కేతన్ తండ్రి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సియా, చేతన్‌పై కేసు నమోదు చేశారు. గతంలో నిందితులిద్దరూ క్రికెట్ మ్యాచ్‌కు హాజరైన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. సియా సోదరుడి ద్వారానే ఆ ఇద్దరికీ పరిచయం ఏర్పడినట్లు అధికారులు గుర్తించారు.

