ఆలయంలో దాదాపు 125 మందిని వివిధ పోస్టుల్లో నియమించారు. వీరిలో కొందరి వద్ద నుంచి సొమ్ములు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఆలయంలో ఉద్యోగుల అపాయింట్‌మెంట్ లెటర్లు, ఫార్మల్ సర్వీస్ అగ్రిమెంట్లు సహా ఇతర పత్రాలు ఏవీ పోలీసుల చేతికి అందలేదు. దీంతో ఎవరి ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిగాయో గుర్తించే పనిలో దర్యాప్తు అధికారులు ఉన్నట్లు సమాచారం. మరోవైపు, ఉద్యోగుల బ్యాంకు ఖాతాలు, వారి లావాదేవీలపై అధికారులు దృష్టి పెట్టనున్నారు. నియమకాల తర్వాత ఏమైనా భారీ లావాదేవీలు జరిగాయా? అనేది గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ కేసులో ఇప్పటికే అరెస్టు అయిన అనుకల్ప్ మిశ్రా, లవ్ కుశ్ మిశ్రాకు ఈ నియామకాల అవకతవకల్లో కీలక పాత్ర ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. రామ మందిర విరాళాల దొంగతనం కేసులో అరెస్టు అయిన 8 మంది నిందితులు.. గతేడాది జనవరి, ఫిబ్రవరిలో ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కుంభమేళా సమయంలోనే అత్యధిక మొత్తంలో విరాళాలు దోచుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఈ క్రమంలోనే నిందితుల ఇళ్లపై బుధవారం మరోసారి అయోధ్య పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ యోగా కేంద్రం నుంచి 'రామరాజ్య కోశ్' అనే పేరుతో ఉన్న విరాళాల హుండీని స్వాధీనం చేసుకున్నారు. దానిపై పేటీఎం క్యూఆర్ కోడ్ ఉంది. నిందితుల్లో ఒకరైన అవినాశ్ శుక్లా.. ఈ యోగా కేంద్రంలోని ఓ గదిలో గత పదేళ్లుగా నివాసం ఉంటున్నారని పోలీసులు తెలిపారు. ఈ కుంభకోణంలో ఎస్‌బీఐ ఉద్యోగుల పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిపై దర్యాప్తు చేయాలంటూ ఈడీకి పోలీసులు లేఖ రాసినట్లు సమాచారం.

