ఈ వివరాలను పరిశీలిస్తే, పున్నేలు గ్రామానికి చెందిన అజారుద్దీన్, ఫర్హత్ (26) అనే దంపతులు ఉండగా, వీరికి ఉమేరా (8), ఆయేషా (6) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అజారుద్దీన్ స్థానికంగా ఓ స్విమ్మింగ్ పూల్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి కుటుంబ సభ్యులంతా కలిసి స్విమ్మింగ్ పూల్ వద్దకు వెళ్లిన కొద్దిసేపటికి ఫర్హత్, ఆమె ఇద్దరు కుమార్తెలు ఈత కొలనులో శవాలై కనిపించారు.
దీనిపై సమాచారం అందుకున్న ఐనవోలు పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఫర్హత్ ఇటీవల మూడోసారి గర్భందాల్చింది. ఈ విషయంపై భార్యాభర్తల మద్య గొడవలు జరుగుతున్నట్టు ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కుమార్తె, మనవరాళ్ల మృతిపై వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

