విద్యార్థుల గొడవను కులాల మధ్య గొడవగా చిత్రీకరించడంతోపాటు ప్రజాప్రతినిధులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంతో పోలీసులు రావణ్‌ను అరెస్టు చేసిన విషయం తెల్సిందే. బుధవారం పిఠాపురం పోలీస్‌స్టేషన్‌లో విచారించిన పోలీసులు.. ప్రజాప్రతినిధులపై అనుచిత వ్యాఖ్యలు ఎందుకు చేశారని ప్రశ్నించారు. రాత్రి పిఠాపురం జూనియర్ సివిల్ జడ్జి బెయిల్ మంజూరు చేయగా గురువారం ఉదయం సర్పవరం పోలీస్టేషన్‌లో మరోసారి విచారణ జరిగింది.
యూట్యూబర్ రావణ్‌పై మరో కేసు నమోదు
వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్‌కు ఏపీ పోలీసులు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. ఓ కేసులో బెయిల్ లభించిన కొద్దిసేపటికే మరో కేసులో కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు అరెస్టు చేశారు. విచారణ సమయంలో ప్రశ్న రావణ్ ఏమాత్రం పోలీసులకు సహకరించలేదని పేర్కొన్నారు.
గొల్లప్రోలు మండలంలోని ఓ పాఠశాలలో 2025లో జరిగిన గొడవను కుల ఘర్షణగా చిత్రీకరిస్తూ వీడియోలు పోస్ట్ చేశారన్న ఆరోపణలపై ఆయనపై కొత్త కేసు నమోదైంది. దీనిపై ప్రశ్నించగా, తాను సమాధానాలు చెప్పనని, తన అరెస్టును కూడా యూట్యూబ్‌లో వీడియోలుగా అప్‌లోడ్ చేసి వ్యూస్ సంపాదించుకుంటానని ఆయన వ్యాఖ్యానించినట్టు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడుని గురువారం సాయంత్రం కోర్టులో హాజరుచనున్నారు.
కాగా, జూన్ 28వ తేదీన ఏలూరులో నిర్వహించిన దళిత క్రైస్తవ నిరసన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పిఠాపురానికి చెందిన జనసేన నేత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ కేసులో రావణ్‌ను హైదరాబాద్ నగరంలో అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచారు. అయితే, కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఆ వెంటనే కాకినాడ సర్పవరం పోలీసులు మరో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

