Siya Point
పూణేలోని లోహగఢ్ కోట వద్ద తన కాబోయే భర్త కేతన్ అగర్వాల్‌ను కొండపైనుంచి తోసివేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సియా గోయల్, చేతన్ చౌదిరిల ప్రయాణ చరిత్రపై మహారాష్ట్ర పోలీసులు జరుపుతున్న దర్యాప్తులో, రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు వారు వెళ్లిన విషయం వెలుగులోకి వచ్చింది.మహారాష్ట్రలోని ఒక సంపన్న వ్యాపారవేత్త కుమారుడైన కేతన్ అగర్వాల్, సియా గోయల్‌లకు ఫిబ్రవరిలో లాంఛనంగా నిశ్చితార్థం జరిగింది. కేతన్‌తో నిశ్చితార్థానికి కొన్ని వారాల ముందు, సియా, చేతన్ ఒక బృందంతో కలిసి ఉదయ్‌పూర్‌కు వెళ్లారు. వారు అక్కడ చాలా రోజులు కలిసి గడిపారు.
ఉదయ్‌పూర్ కోణం, వారి సంబంధం, ప్రయాణ రికార్డులు, ఇప్పటివరకు సేకరించిన అన్ని సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇకపోతే.. పూణేలోని లోహగడ్ కోట వద్ద సియా, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కలిసి 26 ఏళ్ల కేతన్ అగర్వాల్‌ను కొండపైనుంచి తోసి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి . దర్యాప్తు కొనసాగుతున్నందున సియా, చేతన్ ఇద్దరూ జూలై 3 వరకు పోలీసుల అదుపులో ఉన్నారు.
కాగా... యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య ఉదంతం మహారాష్ట్రతో పాటు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. అయితే అతడు హత్యకు గురైన లోహగఢ్ కోట వార్తల్లో నిలపడంతో పర్యాటకుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఈ ఘటన వెలుగులోకి వచ్చినప్పటి నుండి ఈ చారిత్రక కోటను సందర్శించే వారి సంఖ్య దాదాపు 25 శాతం పెరిగినట్లు సమాచారం.
ఈ ఘటన జరిగిన ప్రాంతానికి పర్యాటకులు అనధికారికంగా 'సియా పాయింట్' అని పేరు పెట్టారు. కోటను సందర్శించే వారు అక్కడి భద్రతా సిబ్బందిని, గైడ్లను, తోటి ట్రెక్కర్లను హత్య జరిగిన ఖచ్చితమైన స్థలాన్ని చూపించమని అడుగుతున్నారు.
ఒకప్పుడు కేవలం అందమైన ప్రకృతి దృశ్యాలు, ట్రెక్కింగ్‌కు ప్రసిద్ధి చెందిన ఈ కోట ఇప్పుడు మరో రకంగా ఫేమస్ అయ్యింది. సహ్యాద్రి పర్వత శ్రేణులలో ఉన్న ఈ లోహగఢ్ కోట మహారాష్ట్రలోని వారసత్వ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఈ కోటకు దాదాపు 2 వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉందని, ఇది శాతవాహనుల కాలానికి చెందినదని చరిత్రకారులు భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. కేతన్ అగర్వాల్ హత్య కేసులో దర్యాప్తులో భాగంగా పోలీసులు మంగళవారం లోహగఢ్ కోటను మూసివేశారు. దీనిపైకి పర్యాటకులను అనుమతించడం లేదు.

