సైనస్ సమస్య కారణంగా జనసేన పార్టీ అధినేత, సినీ హీరో, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముక్కుకు చిన్నపాటి సర్జరీ చేసుకుని హైదరాబాద్ నగరంలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఆయనను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం కలుసుకుని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, సైనస్ సమస్య ఇబ్బందిగా భావించినా అది తీవ్ర సమస్యగా పరిణమించిందన్నారు. ఇన్‌ఫెక్షన్‌గా మారి కంటిపై ప్రభావం చూపింది. దీంతో వైద్యులు ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ చేశారు అని తన ఆపరేషన్ వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వివరించారు. సర్జరీ తర్వాత ఇప్పటికే కొంతమేర నాసల్ బ్లీడింగ్ సమస్య ఉందని మరోవారం రోజుల్లో అంతా సర్దుకుంటుందని వైద్యులు చెప్పినట్టు వివరించారు.
కాగా, హైదరాబాద్ నగరంలోని తమ నివాసానికి వచ్చిన సీఎం చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ దంపతులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆరోగ్యం గురించి చంద్రబాబు తెలుసుకున్నారు. సినిమా షూటింగుల్లో భాగంగా యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణల్లో తగిలిన గాయాల్ని అప్పట్లో పట్టించుకోలేదు. అవి కూడా ఇపుడు బాధిస్తున్నాయి అని సీఎంకు పవన్ వివరించారు.

